బ్రిటన్ ఎన్నికల్లో సత్తా చాటనున్న భారతీయులు

మే నెల 6న బ్రిటన్‌లో జరిగే సాధారణ ఎన్నికల్లో భారతీయుల ఓట్లు కీలకం కానున్నాయి. కొన్ని ప్రధాన స్థానాల్లో భారతీయ ఓటర్లు ప్రధానపాత్ర పోషించగలరని, వారు ఓటు వేయాలని బ్రిటన్‌లోని అతిపెద్ద హిందూ ఫోరం కోరింది. బ్రిటన్‌లో ఏడున్నర లక్షల మంది హిందువులున్నారు. బ్రిటన్‌లో ఈసారి హంగ్‌ పార్లమెంట్‌ ఏర్పడే అవకాశం కనబడుతోంది. కొన్ని స్థానాల ఫలితాల్ని హిందువుల ఓట్లే నిర్ణయించవచ్చు అని హిందూ ఫోరం పేర్కొంది.

బ్రిటన్ దేశమంతటా భారతీయులున్నప్పటికీ ప్రధానంగా హిందువులు అధిక సంఖ్యలోనున్నారు. కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థుల గెలుపోటములపై హిందువుల ఓట్ల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఈ ప్రాంతాల నుంచి ఎన్నికయ్యే ప్రజాప్రతినిధులు పార్లమెంటులో హిందువుల సమస్యల్ని ప్రస్తావిస్తుంటారు. కానీ తమ సమస్యల్ని ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని బ్రిటన్‌లోని చాలామంది హిందువుల అభిప్రాయం.

ఇదిలావుండగా వివిధ ప్రాంతాల నుంచి పోటీ చేస్తున్న పార్లమెంటు అభ్యర్థుల గురించి, పార్టీల గురించి హిందువుల్లో అవగాహన కలిగించేందుకు స్థానిక హిందూ ఫోరం ఒక ప్రచార కార్యక్రమాన్ని తలపెట్టింది. ఈ కార్యక్రమంలో ఓటర్లు తమ అభిప్రాయాల్ని కూడా వెల్లడించవచ్చని ఫోరం తెలిపింది.

వెబ్దునియా పై చదవండి