భారత్, అమెరికా దేశాలకు పాక్ పశ్చిమం డేంజర్

మంగళవారం, 10 నవంబరు 2009 (20:02 IST)
పాకిస్థాన్‌లోని పశ్చిమ ప్రాంతంతోపాటు ఆఫ్గనిస్థాన్ భారత్, అమెరికా దేశాలకు యమ డేంజర్ అని అమెరికా తెలిపింది.

భారత్, అమెరికా దేశాలకు పాక్ పశ్చిమ ప్రాంతం యమ డేంజర్ అని, కేవలం ఈ ఇరు దేశాలకే కాకుండా రానున్న రోజుల్లో పశ్చిమ యూరోప్‌కే అపాయమని ఆఫ్గన్, పాకిస్థాన్ దేశాలకు ప్రత్యేక దూతగా వ్యవహరిస్తున్న అమెరికా దౌత్యాధికారి రిచర్డ్ హాల్‌బ్రూక్ అన్నారు.

పాక్ పశ్చిమ ప్రాంతంలోనున్న ఉగ్రవాదులు కేవలం అమెరికాకే ప్రమాదమని తలవకూడదని, వీరు పశ్చిమ యూరోప్, భారతదేశం, పాకిస్థాన్ దేశంలోని ఇతర ప్రాంతాలలోను విధ్వంసం సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు.

ఆఫ్గనిస్థాన్ పట్ల అమెరికా అధ్యక్షుని వ్యవహార తీరు ఏ మాత్రం మారలేదని, తమ దేశం అల్‌ఖైదాను పరాజయం పాల్జేయడానికి కంకణం కట్టుకుందని, అల్‌ఖైదా తీవ్రవాదులను మట్టుబెట్టేంత వరకు తమ దేశం నిద్రపోదని ఆయన అన్నారు.

పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్య పరిపాలన కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని, అదే విధంగా ఆఫ్గనిస్థాన్‌లోను రాబోయే ప్రభుత్వం ప్రజలదై ఉండేలా చర్యలు తీసుకుంటుందని, దీంతోపాటు ఆ ఇరు దేశాల్లోనున్న భద్రతా చర్యలు పటిష్టం చేస్తామన్న మాటకు కట్టుబడివున్నామని ఆయన తెలిపారు.

వెబ్దునియా పై చదవండి