భారత పూజారులపై దాడులు విచారకరం: నేపాల్

తమ దేశంలో భారతీయ పూజారులపై మావోయిస్టులు దాడి చేయడం విచారకరమని నేపాల్ ప్రభుత్వం వ్యాఖ్యానించింది. నేపాల్‌లో ఉన్న ప్రపంచ ప్రఖ్యాత పశుపతినాథ ఆలయానికి ఇటీవల కర్ణాటకకు చెందిన ఇద్దరు భారతీయ పౌరులు పూజారులుగా వెళ్లారు. ఈ ఇద్దరు భారతీయ పూజారులపై మావోయిస్టులు భక్తుల రూపంలో వచ్చి దాడి చేశారు.

బాధితులు గిరీష్ భట్టా (32), రాఘవేంద్ర భట్టా (32)లను శుక్రవారం ఈ పురాతన ఆలయంలోనే మావోయిస్టులు తీవ్రంగా కొట్టి గాయపరిచారు. సుమారు 40- 50 మంది మావోయిస్టులు ఈ దాడిలో పాల్గొన్నారు. ఈ దాడిపై నేపాల్ ప్రభుత్వం శనివారం విచారం వ్యక్తం చేసింది. పూజారులకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చింది.

ఇదిలా ఉంటే దాడికి సంబంధించి పోలీసులు సుమారు 12 మంది అనుమానితులను అరెస్టు చేశారు. వీరిలో మావోయిస్టు గ్రూపుకు చెందిన ఓ నేత కూడా ఉన్నాడు. జరిగిన దాడి చాలా విచాకరమని, పవిత్రమైన ఆలయంలో పూజారులపై మావోయిస్టులు దాడికి తెగబడటం దిగ్భ్రాంతికి గురి చేసిందని నేపాల్ సాంస్కృతిక శాఖ మంత్రి మినింద్ర రిజాల్ తెలిపారు.

ఇదిలా ఉంటే నేపాల్‌లో భారతీయ పూజారులపై మావోయిస్టులు చేసిన దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. భారత విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణ మాట్లాడుతూ.. దాడిని ఖండించారు. అంతేకాకుండా భారతీయుల రక్షణ కోసం నేపాల్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటువంటి దాడులు ఇరుదేశాల సంబంధాలను దెబ్బతీస్తాయని సుతిమెత్తగా హెచ్చరించారు.

వెబ్దునియా పై చదవండి