మావోయిస్టు చీఫ్ ప్రచండ సింగపూర్ ఆకస్మిక టూర్!

మంగళవారం, 17 నవంబరు 2009 (11:09 IST)
నేపాల్ మావోయిస్టు పార్టీ అగ్రనేత ప్రచండ ఆకస్మికంగా సింగపూర్‌కు బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట మరో సీనియర్ నేత కృష్ణ బహుదూర్ మహరా కూడా ఉన్నారు. ఈనెల 20వ తేదీలోగా తమ డిమాండ్లను పరిష్కరించని పక్షంలో దేశ వ్యాప్త ఆందోళనకు శ్రీకారం చుడుతామని ప్రకటించారు. ఈ తేదీ సమీపిస్తున్న తరుణంలో ఆయన ఆయన సింగపూర్‌కు పలాయించడం వెనుక ఆంతర్యమేమిటో ఎవరికీ అంతుచిక్కడం లేదు.

ప్రస్తుతం నేపాల్ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని గిరిజా ప్రసాద్ కోయిరాలా సింగపూర్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయనతో మంతనాలు జరిపేందుకు ప్రచండ అక్కడకు వెళ్లినట్టు సమసమాచారం. తమ డిమాండ్లకు ప్రభుత్వం తలవంచని పక్షంలో రాజీమార్గాన్ని అనుసరించేందుకు ఆయన కోయిరాలాతో చర్చలు జరిపేందుకు అక్కడకు వెళ్లినట్టు నేపాల్ ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

నేపాల్ అధ్యక్షుడు రామ్ భరణ్ యాదవ్, ఆర్మీ చీఫ్ రుక్మాంగదను తొలగించాలని ప్రచండ డిమాండ్ చేస్తున్న విషయం తెల్సిందే. వీటిని పరిష్కరించన పక్షంలో 20 నుంచి ఆందోళన చేపట్టేందుకు నేపాల్ మావోయిస్టు పార్టీలు సమాయత్తమవుతున్నాయి. కాగా, గత ఆరు నెలలుగా నేపాల్‌లో రాజకీయ అనిశ్చితి నెలకొని ఉన్న విషయం తెల్సిందే.

వెబ్దునియా పై చదవండి