ముంబయి దాడులపై భారత్‌తో చర్చలు: పాక్

భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ఎం కృష్ణను పాక్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి షా మహమూద్ ఖురేషి న్యూయార్క్‌లో కలుసుకోనున్నారు. ఈ సందర్భంగా గత ఏడాది ముంబయి మహానగరంలో జరిగిన ఉగ్రవాద దాడులపై చర్చలు జరుపుతానని ఖురేషి చెప్పారు. బుధవారం ఇస్లామాబాద్‌లో ఇఫ్తార్ విందు సందర్భంగా ఖురేషి ఈ విషయాన్ని వెల్లడించారు.

న్యూయార్క్‌లో తాను ఎస్ఎం కృష్ణను కలుసుకుంటానని, ఈ సందర్భంగా ముంబయి దాడులపై చర్చలు జరుపుతానని ఖురేషి జియో టీవీ ఛానల్‌తో చెప్పారు. ముంబయి ఉగ్రవాద దాడుల్లో సుమారు 180 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.

ఈ మారణహోమం ఇరుదేశాల మధ్య సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. ముఖ్యంగా దీని తరువాత ఇరుదేశాల మధ్య శాంతి చర్చల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. ఇరుదేశాల మధ్య విభేదాలను పరిష్కరించుకునేందుకు భారత్, పాకిస్థాన్ చర్చలకు కూర్చోవడమొక్కటే మార్గమని ఖురేషి ఈ సందర్భంగా చెప్పారు.

వెబ్దునియా పై చదవండి