యూఏఈలో భారతీయుల తరపున అభ్యర్థన దాఖలు: భారత్

గురువారం, 8 ఏప్రియల్ 2010 (11:55 IST)
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో మరణ శిక్షను ఎదుర్కొంటున్న 17 మంది భారతీయుల తరపున షార్జా కోర్టులోని అప్పీళ్ళ కోర్టులో అభ్యర్ధనను భారతప్రభుత్వం దాఖలు చేసినట్లు దుబాయ్‌లోని ఇండియన్ కాన్సుల్ జనరల్ సంజయ్ వర్మ గురువారం మీడియాకు తెలిపారు.

పాకిస్థాన్ జాతీయుడి హత్య, ముగ్గురిని గాయపరిచిన కేసులో షార్జాలోని షరియా కోర్టు భారతదేశానికి చెందిన 17 మందికి మరణశిక్ష విధించింది. వీరి తరపున వాదించేందుకు దుబాయ్‌కు చెందిన న్యాయవాది ముహమ్మద్ సల్మాన్‌‍తోపాటు పలువురు న్యాయనిపుణులను నియమించినట్లు ఆయన తెలిపారు.

వీరి తరపున ముహమ్మద్ సల్మాన్‌, తదితర న్యాయనిపుణులు అప్పీళ్ళ కోర్టులో అభ్యర్థన దాఖలు చేశారని, ఈ కేసుతో వారికి ఎలాంటి సంబంధం లేదని కోర్టుకు విన్నవించినట్లు ఆయన పేర్కొన్నారు.

ఇదిలావుండగా భారత్ నియమించిన న్యాయసంస్థ తరపున న్యాయవాది బిందు సురేష్ చతుర్ శిక్ష పడిన 17 మందిని జైలులో కలిసి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పలు పత్రాలపై సంతకాలు సేకరించినట్లు ఆయన మీడియాకు తెలిపారు. కాగా మరణశిక్ష పడిన 17 మందిలో 16 మంది పంజాబ్‌కు చెందిన వారు కాగా ఓ వ్యక్తి హర్యానా వాసిఅని ఆయన వివరించారు.

వెబ్దునియా పై చదవండి