రైఫిల్స్ తిరుగుబాటు: ప్రపంచ సాయం కోరిన బంగ్లా

బంగ్లాదేశ్ రైఫిల్స్ (బీడీఆర్)లో జరిగిన తిరుగుబాటుపై దర్యాప్తులో బంగ్లాదేశ్ ప్రభుత్వం అమెరికా, బ్రిటన్ వంటి ప్రపంచ దేశాల సాయం కోరింది. బంగ్లాదేశ్ రైఫిల్స్ దళాల్లో గత బుధవారం జరిగిన తిరుగుబాటుకు 73 మంది ఆర్మీ అధికారులు బలైన సంగతి తెలిసిందే. వేతన వివాదంపై కొంతమంది సైనికులు బీడీఆర్ అధికారులను నిర్బంధించి కాల్చిచంపారు.

దీనిపై జరిపే దర్యాప్తులో సాయం అందించాలని అమెరికా, బ్రిటన్‌లకు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ఆదివారం విజ్ఞప్తి చేశారు. అమెరికా విదేశాంగ శాఖ సహాయ కార్యదర్శి రిచర్డ్ బౌచర్ ఆదివారం హసీనాకు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా తిరుగుబాటుపై జరిపే దర్యాప్తులో ఎఫ్‌‍బీఐ సాయం అందజేయాలని ఆయనను హసీనా కోరారు.

అంతేకాకుండా దీనికి సంబంధించి బ్రిటన్ సాయం కూడా కోరనున్నట్లు హసీనా తెలిపారు. సైనిక తిరుగుబాటును చిన్న విషయంగా పరిగణించబోమని ఆమె దేశ పార్లమెంట్‌కు వివరించారు. పక్కా వ్యూహం ప్రకారం ఈ సైనిక తిరుగుబాటు జరిగిందన్నారు. ఇదిలా ఉంటే తిరుగుబాటుపై జరిగే విచారణలో సహకరించేందుకు అమెరికా, బ్రిటన్ దేశాలు సుముఖత వ్యక్తం చేశాయి. పారామిలటరీ దళాల్లో జరిగిన తిరుగుబాటును అణిచివేయడంపై హసీనా ప్రభుత్వాన్ని అభినందించారు.

వెబ్దునియా పై చదవండి