లండన్‌లోని భారత ఎంబసీపై దాడి

లండన్‌లోని భారత దౌత్య కార్యాలయంలోకి సోమవారం దూసుకువచ్చిన ఐదుగురు తమిళ ఆందోళనకారులను అక్కడి అధికారులు అరెస్టు చేశారు.

శ్రీలంకలో ఎల్‌టిటిఈపై సైన్యం దాడులకు పాల్పడుతుండటంతో లండన్‌లోని వేలాదిమంది తమిళులు అక్కడి భారత దౌత్య కార్యాలయం వెలుపల నిరసన ప్రదర్శన జరిపారు. ఈ సందర్భంగా ఐదుగురు తమిళులు కార్యాలయం లోపలకు దూసుకు వచ్చి బుల్లెట్ ప్రూఫ్ అద్దాలను పగులగొట్టారు.

ఈ సందర్భంగా ఐదుగురు ఎల్‌టిటిఈ సానుభూతిపరులకు మెట్రోపాలిటన్ పోలీసులు బేడీలు వేసి అదుపులోకి తీసుకున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు. ఆల్డ్‌విచ్‌లోని భారత ఎంబసీ కార్యాలయంలోని ఇండియా హౌస్ వద్ద సోమవారం ఉదయం ఈ సంఘటన జరిగినట్టు కార్యాలయ సిబ్బంది ధ్రువీకరించారు.

ఇదిలావుండగా తొలుత సుమారు 100 మంది ప్రదర్శనకారులు అక్కడకు చేరుకోగా, వీరి సంఖ్య క్రమంగా మూడు వేలకు పెరిగిందని ఎంబసీ ఉన్నతాధికారులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి