లడక్‌లో భారత సరిహద్దును ఉల్లంఘించిన చైనా

ఇటీవల భారత గగనతలాన్ని ఉల్లంఘించిన చైనా ఇప్పుడు లడక్ ప్రాంతంలో భూ సరిహద్దులను కూడా ఉల్లంఘించినట్లు తెలిసింది. కొన్ని వారాల క్రితం చైనా మిలిటరీ హెలికాఫ్టర్లు భారత గగనతలంలోకి వచ్చి వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా చైనా ఆర్మీ లడక్ ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దును ఉల్లంఘించింది.

భారత్, చైనాలు అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తించిన మౌంట్ గ్యా సమీపంలో చైనా దళాలు 1.5 కిలోమీటర్ల మేర భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చాయి. అక్కడ రాళ్లకు ఎరుపు వర్ణంలో పేయింట్ వేశాయని అధికారిక వర్గాలు తెలిపాయి. లడక్‌కు తూర్పు దిశగా ఉన్న చుమర్ సెక్టార్‌లో ఆ దేశ దళాలు రాళ్లపై చైనా అని పేరు రాశాయి.

ఈ ప్రాంతంలో భారత్‌లోని జమ్ము- కాశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలు చైనా సరిహద్దులు పంచుకుంటున్నాయి. మౌంట్ గ్యా ప్రాంతం సముద్రమట్టానికి 22,420 అడుగుల ఎత్తులో ఉంది. బ్రిటన్ పాలకుల హయాంలోనే ఇక్కడ సరిహద్దులను నిర్ణయించారు. దీనిని ఇరుదేశాలు అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తించాయి. సరిహద్దు దళం జులై 31న జులుంగ్ లా (కనుమ)లో రాళ్లు, గుట్టలపై చైనా అని రాసివున్నట్లు గుర్తించింది.

వెబ్దునియా పై చదవండి