లాడెన్ పాకిస్థాన్‌లోనే ఉన్నాడు: అమెరికా

అల్‌ఖైదా తీవ్రవాద సంస్థకు చెందిన చీఫ్ ఒసామా బిన్ లాడెన్ పాకిస్థాన్‌లో తలదాచుకుని ఉన్నాడని, ఇది అతనికి ఎంతో సురక్షితమైన ప్రదేశమని కూడా అమెరికా భావిస్తోంది.

ప్రస్తుతం ఒసామా బిన్ లాడెన్ పాకిస్థాన్‌లోని క్వేట్టా ప్రాంతంలో తలదాచుకుని ఉన్నాడని, అక్కడినుంచి అతని ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగిస్తున్నాడని అమెరికా దౌత్యాధికారి ఇస్లామాబాద్‌ నుంచి ఓ ప్రకటన జారీ చేశారు.

అల‌ఖైదా నాయకత్వం ఇంకా పాకిస్థాన్‌లోనే వేళ్ళూనుకుని ఉందని, ఇటీవల వాషింగ్‌టన్ పర్యటనకొచ్చిన పాక్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి తెలిపారని అమెరికా పేర్కొంది.

పాకిస్థాన్ అల్‌ఖైదా కారణంగానే చాల ఇబ్బందులకు గురవుతోందని, చాలా వరకు దెబ్బతిందని ఆయన తెలిపినట్లు అమెరికా పేర్కొన్నట్లు ఓ వార్తా సంస్థ వెల్లడించింది.

స్వాత్ లోయలో తాము జరిపిన ఆపరేషన్‌లో భాగంగా చాలామంది టెర్రరిస్టులను హతమార్చామని, అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థకు చెందిన రెండవ, మూడవ స్థాయి కలిగిన అగ్రనాయకులను హతమార్చడం జరిగిందని, కొందరిని అదుపులోకి తీసుకున్నామని ఆయన ఓ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వూలో తెలిపారు.

ప్రస్తుతం మిలిటెంట్లు పాకిస్థాన్ నుంచి పారిపోతున్నారని, ఆఫ్గనిస్థాన్ నుంచి సోమాలియా వైపుకు పరుగులిడుతున్నట్లు తమకు సమాచారం అందిందని ఆయన అన్నారు.

వెబ్దునియా పై చదవండి