విక్టోరియా పోలీస్ చీఫ్ ప్రకటనపై భారత్‌ ఆగ్రహం!

సోమవారం, 8 ఫిబ్రవరి 2010 (13:50 IST)
ఆస్ట్రేలియాలోని వివిధ ప్రాంతాల్లో నివశిస్తున్న భారతీయులు వీలైనంత మేరకు పేదవారిగా కనిపించాలని విక్టోరియా నగర పోలీసు కమిషనర్ సైమన్ ఓవర్లాండ్ చేసిన ఉచిత సలహాపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆ ప్రకటనను తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలకు చెందిన అధికార ప్రతినిధులు తీవ్రంగా మండిపడ్డారు.

ఆస్ట్రేలియాను ఏలుతున్నది అక్కడి పాలకులా.. లేక పోలీసు పెద్దలా అంటూ భాజపా ప్రశ్నించింది. ఉచిత సలహాలు మాని.. దాడులకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రయత్నించాలని కాంగ్రెస్ పార్టీ సూచింది.

అంతర్జాతీయ విద్యార్థుల భద్రతపై ఇటీవల నిర్వహించిన ఒక సదస్సులో ఓవర్లాండ్ పాల్గొని ప్రసంగించారు. స్వీయ భద్రత కోసం ఆస్ట్రేలియాలో నివశించే విదేశీ విద్యార్థులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా, భారతీయ విద్యార్థులు వీలైనంత మేరకు పేదవారిగా కనిపించేందుకు ప్రయత్నించాలని కోరారు.

మీకు రక్షణ ఎక్కడ ఉంటుందని భావిస్తే అక్కడ ఉండండి. అలాగే, ప్రజా రవాణా వాహనాల్లో మీ ప్రయాణం సురక్షితం కానపుడు ఆ వాహనాల్లో తిరగడం మానేయాలని సూచించారు. దీనిపై ఆస్ట్రేలియాలోని భారతీయ విద్యార్థుల సంఘాల సమాఖ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

అలాగే, భారత్‌లోని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారీ మాట్లాడుతూ.. ఉచిత సలహాలు మాని విద్యార్థులకు భద్రత కల్పించాలని సూచన చేశారు. అలాగే, భాజపా ప్రతినిధి రాజీవ్ ప్రతాప్ రూఢీ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాలో నివశించాలంటే భారతీయులు పేదవారిలా జీవించాలా అంటూ ప్రశ్నించారు. ఆస్ట్రేలియాలో ప్రభుత్వాన్ని పోలీసులు నడుపుతున్నారా అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు.

వెబ్దునియా పై చదవండి