సైనిక చర్యకు దిగాలనుకున్న బంగ్లాదేశ్ ఆర్మీ

బంగ్లాదేశ్ రైఫిల్స్ (బీడీఆర్) ప్రధాన కార్యాలయంలో తిరుగుబాటు చేసిన జవాన్లపైకి సైనిక చర్యకు దిగేందుకు బంగ్లాదేశ్ ఆర్మీ ప్రయత్నించింది. అయితే బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా సలహాతో ఆర్మీ చివరి నిమిషంలో వెనక్కు తగ్గింది. తిరుగుబాటు జరిగిన రోజు బంగ్లాదేశ్ రైఫిల్స్ ప్రధాన కార్యాలయంపై దాడి చేయడానికి ఆర్మీ సన్నద్ధమయ్యిందని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

అయితే సమస్యను ప్రధానమంత్రి షేక్ హసీనా రాజకీయంగా పరిష్కరించాలనుకున్నారు. ఆపై ఆర్మీ సైనిక చర్యను నిలిపివేయాలని సూచించారని, దీంతో ఆర్మీ వెనక్కుతగ్గిందని మిలటరీ నిఘా విభాగం డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ మహముద్ హుస్సేన్ గత రాత్రి విలేకరులతో తెలిపారు.

బుధవారం తిరుగుబాటు ప్రారంభమైన కాసేపటికే, ఆర్మీ బీడీఆర్ హెడ్‌క్వార్టర్స్‌పై దాడికి రంగం సిద్ధం చేసిందని చెప్పారు. అయితే సంక్షోభాన్ని రాజకీయంగా పరిష్కరించాలనుకున్న షేక్ హసీనా నిర్ణయానికి కట్టుబడి ఆర్మీ సైనిక చర్యను విరమించుకుందన్నారు.

ఆపై పరిణామాలు మరింత హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. వేతన వివాదంపై రెండురోజులపాటు జరిగిన సైనిక తిరుగుబాటుకు 73 మంది సైనికాధికారులు, నలుగురు పౌరులు బలయ్యారు.

వెబ్దునియా పై చదవండి