సముద్రపు నీటిలో కాలుపెట్టాడు... నాలుగు రోజుల్లో అతడిని బ్యాక్టీరియా తినేసింది...

మంగళవారం, 25 అక్టోబరు 2016 (13:11 IST)
సముద్రంలో జలకాలాటలంటే ఎంతో సరదాగా ఉంటుంది కదూ. సముద్రపు స్నానం చేసేందుకు యువత చాలా ఉత్సాహం చూపిస్తుంటారు. కానీ భవిష్యత్తులో సముద్రపు ఒడ్డుకు కూడా పోలేని పరిస్థితి దాపురించే ప్రమాదం పొంచి ఉంది. ఆ నీటిని చేతులతోనే, కాళ్లతోనే తడిపితే ఇక ప్రాణాలు పోయినట్లే. అదేంటి.. సముద్రపు నీరు అంత ప్రమాదకరంగా మారుతున్నాయా అంటే ఈ వార్తను తెలుసుకోవాల్సిందే. బ్యాక్టీరియా అనేది మనిషిని తినేయడం అంటే మనం హాలీవుడ్ చిత్రాల్లో చూస్తూ ఉంటాం. 
 
కానీ ఇది నిజంగా జరిగింది. అమెరికాలోని ఓష‌న్ సిటీలో మైకేల్ ఫంక్ అనే వ్య‌క్తి ఈ బ్యాక్టీరియా నాలుగంటే నాలుగు రోజుల్లో తినేసింది. దాంతో అతడు మృత్యువాత పడ్డాడు. ఇంతకీ ఏం జరిగిందంటే... సెప్టెంబ‌ర్ 11న స‌ముద్ర నీటిలో అత‌ను త‌న పీత‌ల పాత్ర‌ల‌ను శుభ్రం చేస్తున్నాడు. ఆ సమయంలో అతడి కాలికి కొద్దిగా గాయమై ఉంది. ఆ గాయం ద్వారా విబ్రియో వ‌ల్నిఫిక‌స్ అనే మాంసాన్ని తినే ప్ర‌మాద‌క‌ర బ్యాక్టీరియా అతడి శరీరంలోకి ప్రవేశించింది. అలా శరీరంలోకి వెళ్లిని బ్యాక్టీరియా అతడి మాంసాన్ని తినేయడం మొదలుపెట్టింది. 
 
కొన్ని గంటల్లోనే అతడు సొమ్మసిల్లి పడిపోయాడు. తీవ్రమైన జ్వరం వచ్చింది. వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. వారు పరీక్షించి బ్యాక్టీరియా సోకిన కాలును శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. ఐతే ఆ బ్యాక్టీరియా సూపర్ జెట్ స్పీడుతో శరీరం మొత్తం పాకేసింది... దాన్ని నిరోధించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దానితో అతడిని సెప్టెంబరు 15 నాటికి బ్యాక్టీరియా మొత్తంగా తినేసింది. అతడు మరణించాడు. ఈ షాకింగ్ ఘటనపై వైద్యులు తీవ్రంగా పరిశీలన చేసి చూడగా వేడిగా ఉండే ఉప్పునీటి జ‌లాల్లో ఈ విబ్రియో వ‌ల్నిఫిక‌స్ బ్యాక్టీరియా ఉంటుందని తేలింది. 
 
గ్లోబ‌ల్ వార్మింగ్ కారణంగా సముద్ర జలాల్లో ఉష్ణోగ్రత పెరగడంతో అతడు సముద్రంలో దిగిన చోట ఆ బ్యాక్టీరియా ఉందనీ, అతడిని కబళించిందని పరిశోధకులు వెల్లడించారు. కాగా నార్త్ అట్లాంటిక్‌లో ఉన్న ఎనిమిది ప్రాంతాల్లో విపరీతంగా సముద్ర జలాలు వేడెక్కాయనీ, ఈ బ్యాక్టీరియా అక్కడ శరవేగంగా విస్తరిస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు. మనుషులు చేసే తప్పిదాల వల్ల పర్యావరణానికి ముప్పు ఏర్పడటమే కాకుండా తనకు తాను వినాశనం కొని తెచ్చుకుంటున్నాడని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి