పోప్ ఫ్రాన్సిస్‌ను లక్ష్యంగా చేసుకున్న ఐఎస్ఐఎస్ గ్రూపు!

బుధవారం, 17 సెప్టెంబరు 2014 (12:23 IST)
అమెరికా, బ్రిటీష్ దేశాలకు చెందిన జర్నలిస్టుల పీకలు కోసి, ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) గ్రూపు ఇప్పుడు పోప్ ఫ్రాన్సిస్‌ను లక్ష్యంగా చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. వాటికన్‌లో ఇరాక్ అంబాసడర్ హబీబ్ అల్ సదర్. 'లా నజియోన్' అనే ఇటాలియన్ దినపత్రికతో మాట్లాడుతూ, పోప్‌కు ఐఎస్ఐఎస్ నుంచి ముప్పు ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందిందని చెప్పారు. తన ప్రాబల్యాన్ని మరింతగా విస్తరించుకునేందుకు ఈ కిరాతక మూక పోప్‌ను చంపే అవకాశాలున్నాయని సదర్ అభిప్రాయపడ్డారు. 
 
దీనిపై వాటికన్ సిటీ వర్గాలు స్పందిస్తూ.. ముస్లిం ప్రాబల్య దేశం అల్బేనియాలో పోప్ ఫ్రాన్సిస్ పర్యటించాల్సి ఉన్న నేపథ్యంలో... ఈ తరహా వార్తలు రావడం దురదృష్టకరమన్నారు. ఏది ఏమైనా పోప్ పర్యటన జరుగుతుందని పేర్కొన్నాయి. భద్రత పెంచాల్సిన అవసరంలేదని, వాటికన్‌లో ఉపయోగించే ఓపెన్ టాప్ జీపునే, పోప్, అల్బేనియాలోనూ ఉపయోగిస్తారని వాటికన్ ప్రతినిధి ఫాదర్ ఫెడరికో లొంబార్డి తెలిపారు. కాగా, ఇరాక్‌లో మైనారిటీలకు వ్యతిరేకంగా చెలరేగిపోతున్న ఐఎస్ఐఎస్ మిలిటెంట్లపై దాడుల నిర్ణయాన్ని పోప్ సమర్థించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి