ముగిసిన భారత్ పర్యటన...! ఒబామాకు మోడీ వీడ్కోలు...!

మంగళవారం, 27 జనవరి 2015 (17:37 IST)
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మూడు రోజుల భారత పర్యటన విజయవంతంగా ముగిసింది.  మంగళవారం మధ్యాహ్నం ఒబామా దంపతులు ఢిల్లీలోని పాలం ఎయిర్ బేస్ నుంచి సౌదీ అరేబియాకు బయలుదేరి వెళ్లారు. వారికి ప్రధాని మోడీ, భారత దౌత్య అధికారులు వీడ్కోలు పలికారు. 
 
కాగా, ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలోపలికి ప్రవేశించే ముందు ఒబామా, ఆయన అర్థాంగి మిషెల్ భారత వర్గాలకు సంప్రదాయబద్ధంగా రెండు చేతులు జోడించి ధన్యవాదాలు తెలిపి, నిష్క్రమించారు. ఒబామా ఇటీవల మరణించిన సౌదీ రాజు కుటుంబాన్ని పరామర్శిస్తారు.
 
అంతకుముందు ఆయన సిరిఫోర్ట్ ఆడిటోరియంలో ప్రసంగిస్తూ... భారత రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందం కలిగించిందని చెప్పుకొచ్చారు. అమర జవానులకు తన నివాళులని పేర్కొన్నారు. రిపబ్లిక్ డే నాడు గార్డ్ ఆఫ్ ఆనర్‌కు ఓ మహిళ నాయకత్వం వహించడం గొప్ప విషయంగా చెప్పుకొచ్చారు. 
 
భారత్‌లో కుటుంబాలను ఐక్యంగా ఉంచడంలో మహిళలదే కీలకపాత్ర అని తెలిపారు. మహిళల సమానత్వం కోసం అమెరికా కృషి చేస్తుందని చెప్పారు. మహిళా సాధికారత సాధ్యమైనప్పుడే ఏ దేశమైనా పురోగామి పథంలో పయనిస్తుందని అభిప్రాయపడ్డారు.

వెబ్దునియా పై చదవండి