అమెరికాలో గుజరాత్ వాసి హత్య.. షాపు మూసి ఇంట్లోకి వెళ్తుండగా కాల్చి చంపారు

ఆదివారం, 5 మార్చి 2017 (08:09 IST)
అమెరికాలో మరో దారుణం జరిగింది. భారతీయ టెక్కీ శ్రీనివాస్‌ కూచిభొట్ల హత్యను మరువకముందే భారత సంతతి వ్యాపారి ఒకరు దారుణ హత్యకు గురయ్యాడు. అమెరికాలోని దక్షిణ కరోలినాలో ఈ ఘోరం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ టెక్కీ శ్రీనివాస్‌ హత్యను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఖండించిన రెండు రోజులకే ఈ హత్య జరగడం గమనార్హం. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
దక్షిణ కరోలినాలోని లాంకాస్టర్‌ కౌంటీలోని 262 క్రెయిగ్‌ మేనర్‌ రోడ్డులో హర్నీశ్‌ పటేల్‌ అనే వ్యక్తి కుటుంబం నివాసముంటోంది. ఇంటికి ఆరు కిలోమీటర్ల దూరంలో స్పీడ్‌ మార్ట్‌ పేరుతో పటేల్‌ నిత్యావసరాల దుకాణాన్ని నడుపుతున్నాడు. ఆయన గురువారం ఎప్పట్లాగే దుకాణానికి వెళ్లాడు. రాత్రి 11.24 (అమెరికా కాలమానం ప్రకారం) గంటలకు షాప్‌ మూసి.. కారులో ఇంటికి బయలుదేరాడు. సరిగ్గా 9 నిమిషాల్లో... అంటే 11.33 గంటలకు ఇంటికి చేరుకున్నాడు.
 
కారు దిగి ఇంటి వైపు అడుగులు వేస్తుండగానే... కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పటేల్‌పై కాల్పులు జరిపారు. ఆయన అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పటేల్‌ ఇంటి వైపు నుంచి మూడుసార్లు కాల్పుల శబ్దం వినిపించిందని స్థానికులు 911కి ఫోన్‌ చేసి చెపుతున్నారు. కాల్పుల సమయంలో దుండగులకు, పటేల్‌కు మధ్య ఘర్షణ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, పటేల్‌ హత్యకు జాతి వివక్ష కారణం కాకపోవచ్చని, వ్యాపార పోటీ అయివుండొచ్చని పోలీసు అధికారి బారీ ఫెయిల్‌ అభిప్రాయపడుతున్నారు. కాగా, పటేల్ గుజరాత్ వాసి. 14 యేళ్ల క్రితం అమెరికాలు వలస వెళ్లి అక్కడే స్థిరపడిపోయాడు. 

వెబ్దునియా పై చదవండి