ముగిసిన ఒబామా పర్యటన... త్వరలో సింగపూర్ ప్రెసిడెంట్ టూర్!

బుధవారం, 28 జనవరి 2015 (08:57 IST)
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మూడు రోజుల భారత పర్యటన మంగళవారం మధ్యాహ్నంతో ముగిసింది. ఇంతలోనే సింగపూర్ అధ్యక్షుడు టోనీ టాన్ కెంగ్ యామ్ భారత దేశాన్ని పర్యటించేందుకు రానున్నట్టు సమాచారం. భారత గణతంత్ర వేడుకలకు విశిష్ట అతిథిగా హాజరైన ఒబామా భారత ప్రభుత్వం ఇచ్చిన చిరస్మరణీయమైన అతిథ్యాన్ని స్వీకరించారు. 
 
ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య అనేక అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. అలాగే, ఆరేళ్లుగా మరుగునపడివున్న అణు ఒప్పందానికి మళ్లీ కదలిక వచ్చింది. ఇలా అనేక అంశాలపై చొరవ చూపిన ఒబామా తన పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకుని న్యూఢిల్లీ నుంచి టేకాఫ్ అయ్యారు. 
 
అయితే, ఈయన పర్యటన ముగిసిందో లేదో ఇపుడు మరో దేశాధినేత భారత పర్యటనకు రానున్నా. ఈ దఫా వస్తున్నది సింగపూర్ అధ్యక్షుడు టోనీ టాన్ కెంగ్ యామ్. ఈయన ఫిబ్రవరి తొలివారంలో న్యూఢిల్లీ పర్యటనకు వస్తున్నట్టు సింగపూర్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ పర్యటనలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ జరుగనుంది. ఆయన పర్యటన షెడ్యూల్ ను సింగపూర్ రవాణాశాఖ మంత్రి విడుదల చేశారు. 

వెబ్దునియా పై చదవండి