నోట్ల రద్దుకు పాకిస్థాన్ రంగం సిద్ధం.. రూ.5వేల నోటును రద్దుకు తీర్మానం ఆమోదం

మంగళవారం, 20 డిశెంబరు 2016 (16:11 IST)
నల్ల కుబేరుల గుండెల్లో గుబులు రేకెత్తించిన నోట్ల రద్దు నిర్ణయంపై ప్రజలు ఇబ్బందులు పడుతున్న వేళ.. దాయాది దేశమైన పాకిస్థాన్ కూడా నోట్ల రద్దుకు రంగం సిద్ధం చేస్తోంది. తమ దేశంలో నల్లధనాన్ని అరికట్టడానికి దేశంలో ఉన్న అతిపెద్ద నోటు అయిన 5వేల రూపాయల నోటును రద్దు చేయాలని పాకిస్థాన్ సెనేట్ ఒక తీర్మానం ఆమోదించింది. ఇలా నోట్లను రద్దుచేస్తే మార్కెట్లలో సంక్షోభం ఏర్పడుతుందని న్యాయశాఖ మంత్రి జహీద్ హమీద్ పేర్కొన్నారు. 
 
ప్రస్తుతం దేశంలో 3.4 లక్షల కోట్ల నోట్లు చలామణిలో ఉన్నాయని, వాటిలో 1.02 లక్షల కోట్లు 5వేల నోట్లేనని చెప్పారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ముస్లింలీగ్‌కు చెందిన సెనేటర్ ఉస్మాన్ సైఫ్ ఉల్లా ఖాన్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దానికి పార్లమెంటు ఎగువసభలో అత్యధిక సంఖ్యలో సభ్యులు ఆమోదం తెలిపారు. 
 
ఐదువేల రూపాయల నోటును రద్దు చేయడం ద్వారా బ్యాంకు ఖాతాల వినియోగం పెరుగుతుందని.. లెక్కల్లోకి రాకుండా పోతున్న డబ్బు తగ్గుతుందని తీర్మానంలో పేర్కొన్నారు. మార్కెట్లకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు మూడు నుంచే ఐదేళ్ల పాటు ఈ నోట్లను ఉపసంహరణ ప్రక్రియ జరగాలని సూచించారు.

వెబ్దునియా పై చదవండి