ఉగ్ర అనుమానితులను టార్చర్ పెట్టాల్సిందే : డొనాల్డ్ ట్రంప్

శుక్రవారం, 25 మార్చి 2016 (10:00 IST)
ఉగ్ర అనుమానితులను టార్చర్ పెట్టాల్సిందేనని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఉగ్రవాద అనుమానితులను మరిన్ని చిత్రహింసలకు గురిచేయాలని, అలాగైతేనే వారు నిజాలు చెబుతారని, మసీదులపై నిరంతరం గట్టి నిఘా ఉంచాలని తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
 
‘మనకు ఇష్టం ఉన్నా లేకున్నా.. మసీదులపై మరింత నిఘా పెట్టాలి. అక్రమ శరణార్థులను.. ముఖ్యంగా సిరియా శరణార్థులు అమెరికా రాకుండా అడ్డుకోవాలి’ అని ట్రంప్‌ చెప్పారు. డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి రేసులో ఉన్న హిల్లరీ క్లింటన్‌ మాత్రం టార్చర్‌ టెక్నిక్‌ల పునరుద్ధరణను గట్టిగా వ్యతిరేకించారు. 
 
బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో.. టీవీ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. భవిష్యత్తులో అమెరికాపై దాడుల నివారణకు దర్యాప్తు అధికారులకు పలు రకాలుగా టార్చర్‌ చేసే అధికారాలివ్వాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా నిందితుల్ని నీళ్లలో ముంచడం ద్వారా నిజం చెప్పించే టెక్నిక్‌ను పునరుద్ధరించాలని అన్నారు. 2009లో బరాక్‌ ఒబామా ఈ టెక్నిక్‌ను నిషేధించారు.

వెబ్దునియా పై చదవండి