బురఖా లేకుండా టీవీలో యాంకర్ ముఖం..ఫైర్!

బుధవారం, 20 ఆగస్టు 2014 (14:16 IST)
మహిళా టీవీ యాంకర్ ముఖం టీవీలో కనిపించడంపై సదరు టీవీ చానల్ యాజమాన్యం వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇటీవల లండన్‌లో ఉన్న అల్ ఎ ఖబరియా సౌదీ చానెల్ స్టూడియో నుంచి ఓ యువతి వార్తలు చదివింది. ఆ సమయంలో ఆమె బురఖా ధరించలేదు. దీంతో ప్రేక్షకులు అవాక్కయ్యారు. 
 
ఓ ముస్లిం చానెల్లో, ముస్లిం యువతి ఆ విధంగా వార్తలు చదవడం సంచలనాన్ని సృష్టించింది. దీనిపై విమర్శలు, ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. ఈ చానెల్లో కార్యక్రమాలకు అతిథిగా వచ్చే విదేశీ వనితలకు తప్ప, మరెవరరికీ తల మీద ముసుగు లేకుండా కనిపించే హక్కు లేదు. 
 
ఇది తీవ్రమైన మత ద్రోహమంటూ మతగురువులు, పెద్దలు తీవ్ర విమర్శలు గుప్పించారు. దాంతో భయపడిన చానెల్ నిర్వాహకులు ఆమె తమ చానెల్ ఉద్యోగి కాదని, లండన్‌కు చెందిన గెస్ట్ న్యూస్ రీడర్ అని, అందువల్లే పొరపాటు జరిగిందని మత పెద్దలకు వివరణ ఇచ్చింది.
 
ఈ వివరణపై హక్కుల కార్యకర్తలు మండిపడుతున్నారు. ముస్లిం న్యూస్‌ రీడర్లకు ముఖాన్ని చూపించే హక్కు లభించేవరకూ పోరాడతామని వారు హెచ్చరిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి