గిల్గిట్ - బాల్టిస్థాన్‌కు పాకిస్థాన్ నుంచి విముక్తి కల్పించండి.. ప్రధాని మోడికి లేఖ

ఆదివారం, 23 అక్టోబరు 2016 (14:55 IST)
'గిల్గిట్-బాల్టిస్థాన్ ప్రజలకు పాకిస్థాన్‌ నుంచి విముక్తి కల్పించవలసిన చట్టబద్ధ, నైతిక బాధ్యత భారతదేశానికి ఉంది' అంటూ బలవరిస్థాన్ నేషనల్ ఫ్రంట్ (బీఎన్ఎఫ్) ఛైర్మన్ అబ్దుల్ హమీద్ ఖాన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. బలూచిస్థాన్‌తో పాటు పాకిస్థాన్ ఆక్రమణలో ఉన్న గిల్గిట్-బాల్టిస్థాన్‌ గురించి మాట్లాడిన మొదటి భారతదేశ ప్రధాన మంత్రి మీరేనని ఆయన ఈ సందర్భంగా ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. 
 
బలూచిస్థాన్‌ను 1948లో పాకిస్థాన్‌లో రాష్ట్రంగా చేసినప్పటికీ గిల్గిట్-బాల్టిస్థాన్ మాత్రం భారతదేశంలో రాజ్యాంగబద్ధ భాగమని తెలిపారు. 1947 అక్టోబరు 26న జమ్మూ-కాశ్మీరు మహారాజు హరిసింగ్ రాసిన దస్తావేజు ఇదే చెప్తోందన్నారు. పార్లమెంట్ 1994లో ఆమోదించిన తీర్మానం ప్రకారం జమ్మూ-కాశ్మీర్‌లో కొన్ని సీట్లను గిల్గిట్-బాల్టిస్థాన్ ప్రతినిధులకు కేటాయించారన్నారు. 
 
గిల్గిట్-బాల్టిస్థాన్ గురించి పాకిస్థాన్ రాజ్యాంగం, సుప్రీంకోర్టు చెప్తున్నదాని ప్రకారం ఆ ప్రాంతం జమ్మూ-కాశ్మీరులోని వివాదాస్పద ప్రాంతమని తెలిపారు. పాకిస్థాన్ నిరంకుశత్వం నుంచి గిల్గిట్-బాల్టిస్థాన్‌ను విడిపించి, ప్రజలను కాపాడవలసిన చట్టబద్ధ, నైతిక బాద్యత భారతదేశ ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి