ఆమె తన ప్రియుడికి వాలెంటైన్ డే సందర్భంగా కిడ్నీని గిఫ్ట్‌గా ఇచ్చింది. ప్రేమకు సరికొత్త అర్థాన్నిస్తూ.. తన ప్రేమికుడిని కాపాడుకునేందుకు ఆ ప్రేయసి తన రెండు కిడ్నీలలో ఒకటి దానంగా ఇచ్చేసింది. ప్రియుడి కోసం ఆ అమ్మాయి ఇచ్చిన కానుకతో ఆశ్చర్యపోయిన వైద్యులు.. కిడ్నీ ఆపరేషన్‌ను ఫిబ్రవరి 14న (ప్రేమికుల రోజు) ఫిక్స్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లండ్‌లోని హాంప్‌షైర్‌కు చెందిన జాక్ సిమర్డ్ (49) గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు.
19 సంవత్సరాల క్రితం అతని సోదరి కిడ్నీ ఇవ్వడంతో ఒక కిడ్నీని అమర్చారు. ఇటీవల రెండో కిడ్నీకూడా పాడవటంతో కిడ్నీదాత కోసం ఎదురుచూస్తున్నాడు. సహజంగా గోల్ఫర్ అయిన ఇతనికి గత ఏడాది సమ్మర్లో స్టోన్బ్రిడ్జ్ కౌంటీ క్లబ్లో.. మరో గోల్ఫర్ అయిన మిచెల్లీ లా బ్రాంచ్‌తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలో కిడ్నీ సమస్యతో బాధపడుతూ వచ్చిన జాక్‌కు మిచెల్లీ కిడ్నీ దానం చేయాలనుకుంది.
వెంటనే ప్రియుడు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లి తన కిడ్నీలు అతనికి సరిపోతాయోమనని రహస్యంగా టెస్టులు చేయించుకుంది. అంతేగాకుండా కిడ్నీలు తన ప్రియుడికి సరిపోవడంతో తన ప్రేమికుడికి తన కిడ్నీని అమర్చాలని విజ్ఞప్తి చేసింది. మిచెల్లీ నిర్ణయంతో వైద్యులు షాక్ తిన్నారు. జాక్ మీదున్న ప్రేమతో కిడ్నీ ఇచ్చేందుకు ముందుకొచ్చిన మిచెల్లీ ప్రేమకు గుర్తుగా వైద్యులు కిడ్నీ ఆపరేషన్‌ను ఫిబ్రవరి 14న.. ప్రేమికుల రోజున నిర్వహించేందుకు రెడీ అయ్యారు.