యురీ దాడికి పాకిస్థాన్ ప్రేరేపిత జైష్ తీవ్రవాద సంస్థ కారణమని భావిస్తున్న తరుణంలో భారత ప్రభుత్వాన్ని, భారత సైన్యాన్ని అవహేళన చేసేలా జైషే మహ్మమద్ చీఫ్ మసూద్ అజార్ వ్యాఖ్యానించారు. భారతదేశ శూరత్వం బాలీవుడ్ సినిమాలకే పరిమితమని ఎద్దేవా చేశారు.
మసూద్ వ్యాఖ్యలతో కూడిన 9.41 నిమిషాల నిడివి ఉన్న ఆడియో క్లిప్‌ను ఈ నెల 19న జైషే సంస్థ తన అనుబంధ ఆన్లైన్ చానల్ రంగొనూర్లో పెట్టింది. ఉర్దూలో ఉన్న ప్రకటనను రంగొనూర్ వెబ్సైట్లోనూ పోస్టు చేసింది. ‘ద రియల్ ఫౌంటెయిన్ హెడ్’ పేరుతో వీటిని విడుదల చేశారు. ‘‘బాలీవుడ్ సినిమాలు భారతను అజేయమైన శక్తిగా, పాకిస్థాన్‌ను బలహీనమైన దేశంగా చిత్రీకరిస్తాయన్నారు.
ముఖ్యంగా... తమ నీడను చూసి బెంబేలెత్తే బాలీవుడ్ హీరోలు పాకిస్థాన్‌లోని ముజాహిదీన్ శిబిరాలపై దాడులు చేస్తారు. ఒక్క దెబ్బతో వందలాది ముజాహిదీన్లను మట్టుబెడతారు. బాలీవుడ్ హీరోలకు మాత్రం ఒక్క బుల్లెట్ కూడా తగలదు. వారి స్టంట్లన్నీ ఒట్టి గ్యాస్’ అంటూ బాలీవుడ్ సినిమాలు, హీరోలపై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.