ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌‌లో ఒక్క క్షణం ఉండొద్దు... : ఇండియన్ ఎంబసీ వినతి

బుధవారం, 2 మార్చి 2022 (08:19 IST)
రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య సాగుతున్న యుద్ధం బుధవారానికి ఏడో రోజుకు చేరుకుంది. మరోవైపు, ఆ రెండు దేశాలూ బుధవారం రెండో దఫా చర్చలు జరుపనున్నాయి. అయితే, రష్యా సైనికులు జరుపుతున్న బాంబు దాడుల దెబ్బకు ఉక్రెయిన్ ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. దీంతో తమ నివాసాలను ఖాళీ చేసిన ప్రాణాలను కాపాడుకునేందుకు బంకర్లను, మెట్రో రైళ్ల అండర్ గ్రౌండ్లను ఆశ్రయిస్తున్నారు. 
 
అదేసమయంలో అక్కడ ఉన్న భారత పౌరులు, విద్యార్థులను తరలించేందుకు కేంద్రం ప్రత్యేక దృష్టిసారించింది. అయితే, ఉక్రెయిన్‌లో పరిస్థితి రోజురోజుకూ భయానకంగా మారడంతో అక్కడ ఉన్న భారత పౌరులు, విద్యార్థులు తక్షణం కీవ్ నగరాన్ని వీడాలని భారత దౌత్య కార్యాలయం మంగళవారం కోరింది. 
 
ఉపగ్రహ ఛాయా చిత్రాల ప్రకారం కీవ్ నగరానికి 64 కిలోమీటర్ల మేరకు రష్యా సైనికులు ఉక్రెయిన్ వైపు దూసుకొస్తున్నట్టు వెల్లడైన నేపథ్యంలో భారత దౌత్య కార్యాలయం ఈ మేరకు అత్యవసర ప్రకటన విడుదల చేసింది. అందుబాటులో ఉన్న రవాణా మార్గాల ద్వారా ప్రజలు అక్కడ నుంచి బయటపడాలని కోరింది. 
 
కీవ్‌లో ఉన్న భారత పౌరులు, విద్యార్థులు తక్షణమే రాజధాని నగరాన్ని వీడాలని, రైళ్లు, అందుబాటులో ఉన్న ఇతర రవాణా మార్గాల ద్వారా అక్కడి నుంచి బయలుదేరాలని ఆ ప్రకటనలో తెలిపింది. ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతం వైపునకు వెళ్లేందుకు కీవ్‌లో రైళ్లు సిద్ధంగా ఉన్నాయని అందువల్ల భారత పౌరులు, విద్యార్థులు వాటి ద్వారా సరిహద్దు దేశాలకు చేరుకోవాలని కోరింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు