కాలం కలసి వస్తే గాజు ఉంగరం కూడా కోటీశ్వరులను చేస్తుందనేందుకు నిదర్శనంగా ఓ ఘటన చోటు చేసుకుంది. లండన్‌కు చెందిన డెబ్రా గడ్డర్డ్ (55) 33 ఏళ్ల కిందట ఓ బూట్ బజార్‌లో (చిన్న సంత) గాజు ఉంగరాన్ని కొనుగోలు చేసింది. అప్పుడు దాని విలువ రూ.970 మాత్రమే. కొన్ని రోజులు ధరించిన తర్వాత దానిని ఓ పెట్టెలో పెట్టి భద్రపరిచింది.
అయితే తన తల్లి ఇటీవల ఓ బంధువు చేతిలో మోసపోయి ఉన్నదంతా పోగొట్టుకొంది. జీవనం దుర్భర స్థితికి చేరుకుంది. ఈ తరుణంలో తల్లిని ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో గడ్డార్డ్ తన దగ్గరున్న నగలు అమ్మాలని నిర్ణయించుంది. అప్పటికే ఎన్నో ఆభరణాలను అమ్మేసింది. దాదాపు 15 సంవత్సరాల పాటు పెట్టెలో ఉంచిన గాజు ఉంగరాన్ని కూడా నగల దుకాణంలో అమ్మకానికి పెట్టింది.
గాజు ఉంగరాన్ని పరిశీలించిన వ్యాపారి, అది మామూలు ఉంగరం కాదని 26.27 క్యారెట్ల వజ్రమని చెప్పడంతో డెబ్రా గడ్డార్డ్ ఆశ్చర్యపోయింది. 970 రూపాయలతో కొన్న ఉంగరంలో వజ్రాలు పొదిగి ఉన్నాయని చెప్పినా నమ్మలేకపోయింది. దానిని సోత్బీ సంస్థ దగ్గరికి తీసుకెళ్లి వేలానికి పెట్టారు. వేలం ఖర్చులు పోగా గడ్డార్డ్ చేతికి రూ.4.3 కోట్లు చేరాయి.