మలాలాకు అత్యున్నత గౌరవం... ఐరాస ‘శాంతిదూత’గా నియామకం

ఆదివారం, 9 ఏప్రియల్ 2017 (11:43 IST)
బాలల హక్కుల కోసం పోరాడుతున్న నోబెల్‌ బహుమతి గ్రహీత, పాకిస్థాన్ యువతి మలాలా యూసఫ్‌జాయ్‌కు అత్యున్నత గౌరవం లభించింది. ఆమెను శాంతిదూతగా ఎంపిక చేసినట్లు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ ప్రకటించారు. ఐరాస శాంతిదూతగా నియమితులరాలైన అత్యంత పిన్న వయస్కురాలుగా మలాలా చరిత్ర సృష్టించింది. ఐరాస ప్రధాన కార్యాలయంలో వచ్చే వారం జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఈ హోదాను ఆమె కట్టబెడతారు. 
 
దీనిపై గుటెరస్ స్పందిస్తూ.. 'మహిళలు, యువతుల హక్కు కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడుతూ మలాలా అసాధారణ ప్రతిభ కనబరుస్తుంది' అందుకే శాంతిదూతగా ఎంపిక చేసినట్లు వివరించారు. బాలికల విద్యా హక్కు కోసం మలాలా ప్రదర్శిస్తున్న ధైర్యసాహసాలను చూసి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది స్ఫూర్తి పొందుతున్నారన్నారు. 
 
శాంతిదూతగా మలాలాను ఎంపిక చేయడం వల్ల మహిళలకు మరింత మేలు చేకూరుతుందని తెలిపారు. 19ఏళ్ల మలాలా బాలిక విద్య కోసం పోరాడుతూ ఓ చిహ్నంలాగా నిలిచిందని కొనియాడారు. ఐరాస కార్యకలాపాలను, ఆదర్శభావాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు బాగా పాపులర్‌ అయిన ప్రముఖులను శాంతిదూతగా ఎంపిక చేయడం జరుగుతోంది.

వెబ్దునియా పై చదవండి