నరేంద్ర మోడీ టైమ్ మ్యాగజైన్‌లో ఒబామా స్పెషల్ ఆర్టికల్!

శుక్రవారం, 17 ఏప్రియల్ 2015 (11:28 IST)
భారత ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మధ్య ఫ్రెండ్‌షిప్ బాగా కుదిరినట్టుంది. అందుకేనేమో.. నరేంద్ర మోడీ టైమ్ మ్యాగజైన్‌లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రత్యేక ఆర్టికల్ రాశారు.  ప్రపంచంలోని 100 ప్రభావవంతుల జాబితాను టైమ్ మ్యాగజైన్ విడుదల చేస్తున్న సందర్భంగా ఆ పత్రికకు ఒబామా 160 పదాల్లో మోడీపై ఈ ఆర్టికల్ రాశారు.  
 
ఈ స్పెషల్ ఆర్టికల్‌లో మోడీని 'ప్రధాన సంస్కరణకర్త'గా ఒబామా పేర్కొన్నారు. "ఓ బాలుడిగా నరేంద్రమోడీ తనవంతుగా కుటుంబానికి మద్దతిచ్చేందుకు తన తండ్రికి సాయంగా టీ అమ్మారు. ప్రస్తుతం ఆయన ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి నాయకత్వం వహిస్తున్నారు. పేదరికం నుంచి ప్రధానిగా సాగుతున్న ఆయన జీవితం భారతదేశ కార్యశూరత్వం, సామర్థ్య ఉన్నతిని ప్రతిబింబిస్తుంది" అని ఒబామా పేర్కొన్నారు. 
 
"అనేకమందికి సాయం చేయాలన్న ఆయన కృతనిశ్చయం తన దారిలో భారతీయులను నడిపించేలా చేస్తుంది. ఘోరమైన పేదరికాన్ని తగ్గించేందుకు, విద్యను మరింత మెరుగుపరిచేందుకు, మహిళలు, బాలికలను శక్తిమంతం చేసేందుకు, నిజమైన భారత ఆర్థిక సామర్థ్యాన్ని సాధించేందుకు మోడీలో ప్రతిష్ఠాత్మకమైన విజన్ ఉంది" అని పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి