ముషారఫ్‌కు రక్తపోటు: ఆస్పత్రిలో చేరిక.. ఆపై డిశ్చార్జ్!

శుక్రవారం, 12 ఫిబ్రవరి 2016 (09:43 IST)
పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ రక్తపోటు సమస్యతో గురువారం ఆసుపత్రిలో చేరారు. 72 ఏళ్ల ముషారఫ్ కరాచీలో కుటుంబ సభ్యులతో కూర్చుని వుండగా వున్నట్టుండి కుప్పకూలిపోయారు. అనంతరం చికిత్సకోసం కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆయన్ను పీఎన్‌ఎస్‌ షఫీ ఆసుపత్రికి తరలించారు. ఆయన కోసం వ్యక్తిగత వైద్యుడిని కూడా పిలిపించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
 
వైద్య బృందం తక్షణమే ఆయనకు అవసరమైన వైద్యపరీక్షలు నిర్వహించింది. ప్రస్తుతానికి ముషారఫ్ ఐసీయులో చికిత్స పొందుతున్నారని, అయితే ఆయనకు ప్రాణాపాయం ఏమీ లేదని, బీపీ అధికమవ్వడం వలనే ఆయన స్పృహతప్పి పడిపోయారని వైద్యులు తెలిపారు. చికిత్స అనంతరం ముషారఫ్‌ని ఇంటికి తరలించారు. చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్ళారని.. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి