ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో మోడీ స్పీచ్ - ఇండో-ఆసీస్ మధ్య 5 కీలక ఒప్పందాలు!

మంగళవారం, 18 నవంబరు 2014 (13:01 IST)
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ఆ దేశ పార్లమెంట్‌ను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఐదు కీలక ఒప్పందాలు కుదిరాయి. వీటిలో భారత్, ఆస్ట్రేలియా దేశాల మధ్య సామాజిక, తీర ప్రాంత భద్రత, ఖైదీల బదలాయింపు, మాదక ద్రవ్యాల వాణిజ్యం అరికట్టడం, పర్యాటకం, సాంస్కృతిక రంగాలపై ఒప్పందాలు కుదిరాయి. 
 
ఈ మేరకు భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్‌లు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ, సామాజిక భద్రత ఒప్పందం సానుకూలమైన పరిణామమని అన్నారు. భద్రత సహకారంపై కుదిరిన ఒప్పందాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. ఇక 2015లో ఆస్ట్రేలియాలో 'మేక్ ఇన్ ఇండియా' ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. భారత్ సూపర్ పవర్‌గా ఎదుగుతుందని ఆకాంక్షిస్తున్నామని ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ చెప్పుకొచ్చారు. 
 
అంతకుముందు పార్లమెంట్‌లో ఆయన ప్రసంగిస్తూ ఆస్ట్రేలియా పార్లమెంటులో ప్రసంగించడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. జీ20 సదస్సును విజయవంతం చేసిన ఆస్ట్రేలియా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజాస్వామ్య భావనలో ఐక్యంగా ముందుకెళ్దామన్నారు. భారతీయ యువత మార్పు కోరుకుంటోందని, 30 ఏళ్ళ తర్వాత భారత్‌లో స్థిర ప్రభుత్వం వచ్చిందన్నారు. ఉగ్రవాదం అందరి సమస్యగా మారిందన్నారు. భారత్ మూడు దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని ఎదుర్కుంటోందన్నారు. ప్రధాన రంగాల్లో ఆస్ట్రేలియా భాగస్వామ్యం కోరుకుంటున్నట్లు చెప్పారు. భారత ప్రజలు అభివృద్ధి, పారదర్శకత కోరుకుంటున్నారన్నారు. 

వెబ్దునియా పై చదవండి