అప్పుడు వాన్నా క్రై... ఇప్పుడు పెట్యా..ఏం వైరస్‌లో.. ప్రపంచాన్నే ముంచుతున్నాయి

బుధవారం, 28 జూన్ 2017 (05:25 IST)
కనిపించని ప్రాణాంతక వైరస్ మనుషుల్లో దూరితే జరిగే విధ్వంసం సమాజాలనే అతలాకుతలం చేస్తుందని అందరికీ తెలుసు. మరి కంటికి కనిపించని వైరస్ ఒక కంప్యూటర్లో దూరితే, యాంటీవైరస్ దాన్ని గమనించకపోతే, లేక గమనించే లోపే అది కలిగించి విధ్వంసం ఇప్పుడు క్షణాల్లో ప్రపంచ వ్యాప్తంగా పాకిపోతోంది. ఒక వైరస్ కొన్ని దేశాల విమానాశ్రయాలను, బడా బ్యాంకింగ్ కార్యకలాపాలను స్తంభింప చేస్తుందంటే కొన్నేళ్ల క్రితం అయితే నమ్మేవాళ్లం కాదు కానీ, ఇప్పుడు దేన్నయినా నమ్మాల్సి వస్తోంది. 
 
ఉక్రెయిన్‌లో మొదలైన ‘పెట్యా’ అనే రాన్సమ్‌వేర్‌ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు శరవేగంగా విస్తరిస్తూ బెంబేలెత్తిస్తోంది. ఉక్రెయిన్‌లోని పవర్‌గ్రిడ్‌, బ్యాంకులు, ప్రభుత్వ ఆఫీసుల్లో కంప్యూటర్లను ఈ రాన్సమ్‌వేర్‌ నిలిపివేసింది. ప్రభుత్వ కార్యకలాపాలు సాగే ప్రధాన కార్యాలయంలోని కంప్యూటర్లన్నిటినీ దీనివల్ల షట్‌డౌన్‌ చేసేసినట్టు ఉక్రెయిన్‌ ఉప ప్రధాని పావ్‌లో రోజెంకో తెలిపారు. దీని దెబ్బకు అక్కడి టెలిఫోన్‌ కంపెనీ కార్యాలయాలు, మెట్రో వ్యవస్థలు, ఉక్రెయిన్‌ రాజధానిలోని బోరిస్పిల్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కంప్యూటర్లు సైతం నిలిచిపోయాయి. ఇది ఉక్రెయిన్‌ చరిత్రలోనే అతిపెద్ద సైబర్‌ దాడి అని ఆ దేశ హోం మంత్రి ప్రకటించారు.
 
భారత్‌లో ప్రభావానికి గురైన జేఎన్‌పీటీలోని జీటీఐ టర్మినల్‌ని ఏపీ మోలర్‌ నిర్వహిస్తోంది. మాల్‌వేర్‌ దాడితో ఏపీ మోలార్‌లో కంప్యూటర్లు స్తంభించడంతోనే జీటీఐ ప్రభావితమైందని జేఎన్‌పీటీ అధికారి తెలిపారు. హేగ్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఏపీఎం గుజరాత్‌లోని పిపావావ్‌ టర్మిన్‌ల్‌ను ఆపరేట్‌ చేస్తోంది.
 

వెబ్దునియా పై చదవండి