ఎమ్మెల్యే కొడుకైతే నాకేంటి.. ఆ బీజేపీ విభాగాన్ని రద్దు చేయండి : మోడీ ఆగ్రహం

మంగళవారం, 2 జులై 2019 (16:26 IST)
అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు వచ్చిన మున్సిపల్ అధికారులపై క్రికెట్ బ్యాట్‌తో దాడి చేసిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తావ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పైగా, జైలుకెళ్లి వచ్చిన నిందితుడుని స్వాగతించిన బీజేపీ విభాగాన్ని రద్దు చేయాల్సిందిగా ప్రధాని మోడీ ఆదేశించారు. 
 
ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇండోర్-3 అసెంబ్లీ ఎమ్మెల్యే ఆకాశ్ విజయ్‌వర్గీయ ఓ మున్సిపల్ అధికారిపై క్రికెట్ బ్యాటుతో దాడి చేసిన విషయం తెల్సిందే. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనమైంది. దీనిపై ప్రధాని మోడీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు నేత ఎవరి కుమారుడైనప్పటికీ తాను అలాంటి చర్యలను అంగీకరించబోనన్నారు. 
 
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షత మంగళవారం ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆకాశ్ వ్యవహారంపై ప్రధాని తీవ్రంగా స్పందించారు. అధికారిపై దాడి కేసులో అరెస్టు అయిన ఆకాశ్.. ఆదివారం జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ స్థానిక నేతలు ఆయనకు పూలమాలలు వేయడం, పార్టీ ఆఫీసు వద్ద గాల్లోకి కాల్పులు జరపడం వంటి పనులపైనా ప్రధాని ఫైర్ అయ్యారు. 
 
ఆకాశ్ విజయ్‌వర్గీయ ఇటీవల ప్రవర్తించిన తీరుపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆకాశ్ జైలు నుంచి బయటికి రావడాన్ని స్వాగతించిన స్థానిక బీజేపీ విభాగాన్ని వెంటనే రద్దు చేయాలంటూ ప్రధాని ఆదేశించారు. అలాంటి నేతలను పార్టీ నుంచి బహిష్కరించాలని కూడా ప్రధాని కోరినట్టు సమాచారం. పైగా, ఈ వ్యవహారంపై పూర్తి విచారణ చేపట్టాలి. ఇలాంటి చర్యలను ప్రోత్సహిస్తున్న వారిని కూడా ప్రశ్నించాలి. పార్టీ ఎంపీలంతా బాధ్యతాయుతంగా, సహృదయంతో వ్యవహరించంచాలని కోరారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు