కోవిడ్ మహమ్మారి తాకిడితో అల్లాడిపోతున్న ప్రపంచానికి తీపి కబురులా వినిపించే ఈ సమాచారాన్ని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ స్వయంగా వెల్లడించింది. రష్యా వాక్సిన్ తొలిదశ ప్రయోగాల్లో పాల్గొన్న 38 మంది కరోనా వైరస్ దాడిని నిలువరించగలిగే శక్తిని గణనీయమైన స్థాయిలో కనబరిచారని ఈ ప్రయోగాలు ఇచ్చిన ఫలితాలను ఆధారం చేసుకునే తమ దేశం ఆగస్టు నాటికి తొలి వాక్సిన్ అందివ్వగలమనే విశ్వాసాన్ని పెంచుకున్నామని రష్యా పేర్కొంది.
ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌తో రెట్టింపు రక్షణ
బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు టీకా అభివృద్ధిలో ముందడుగు వేశారు. వారు రూపొందించిన వ్యాక్సిన్‌తో కరోనా వైరస్ నుంచి 'రెట్టింపు రక్షణ' లభిస్తుందని మానవులపై నిర్వహించిన తొలి దశ ప్రయోగాల్లో తేలింది. యాంటీ బాడీలతోపాటు వైరస్ హంతక 'టి' కణాలను ఉత్పత్తి చేసేలా శరీరాన్ని ఈ టీకా ప్రేరేపిస్తున్నట్లు పరిశోధకులు చెప్పారు.