నడి బజారులో జనం చూస్తుండగా పాకిస్థానీ తలనరికేసిన సౌదీ అరేబియా!

శనివారం, 1 ఆగస్టు 2015 (12:47 IST)
సౌదీ అరేబియాలో కఠిన శిక్షలు అమలవుతాయన్న సంగతి తెలిసిందే. షరియా చట్టాల అమలులో సౌదీ అరేబియా పేరెన్నికగన్న దేశం. చిన్నపాటి నేరాలకే అక్కడ కఠిన శిక్షలు అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో మాదకద్రవ్యాలు స్మగ్లింగ్ చేశాడన్న కారణంతో పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి తలను సౌదీ అరేబియా అధికారులు నడి బజారులో జనం చూస్తుండగా పదునైన కత్తితో తెగనరికేశారు.
 
పాకిస్థాన్ జాతీయుడు షా ఫైజల్ అజీజ్ షా హెరాయిన్, కొకైన్ తరహా మాదకద్రవ్యాలను సౌదీ అరేబియాలో విక్రయిస్తూ ఆ దేశ అధికారులకు పట్టుబడ్డాడు. తమ దేశానికి చెందిన యువతను డ్రగ్స్‌కు బానిసలను చేస్తున్నాడని అతడిపై అభియోగాలు నమోదు చేశారు. ఈ నేరానికి అతడికి మరణ దండన విధించారు. తీరా శిక్ష అమలు చేసే సమయమొచ్చేసరికి రంజాన్ పవిత్ర మాసం ప్రారంభమైందట. 
 
దీంతో షా శిక్ష అమలును వాయిదా వేసిన అధికారులు, రంజాన్ ముగిసిన నేపథ్యంలో ఇటీవల అతడికి శిక్ష అమలు చేశారు. ముఖానికి నల్లగుడ్డ కట్టి, చేతులు వెనక్కు కట్టేసి నడిరోడ్డుపై మోకాళ్లపై కూర్చోబెట్టి జనం చూస్తుండగానే అతడి తలను కత్తితో నరికేశారు.

వెబ్దునియా పై చదవండి