అగ్ర రాజ్యమైన అమెరికా పీఠాన్ని అధిరోహించేది డొనాల్డ్ ట్రంపేనని తేలిపోయింది. ఈ నేపథ్యంలో సెర్చ్ ఇంజిన్ గూగుల్‌లో డొనాల్డ్ ట్రంప్ గురించి వెతికిన వాళ్లే అధికంగా ఉన్నారట. గూగుల్ ఎక్కువ మంది ఎవరి గురించి, ఏ అంశం గురించి వెతికారో నివేదికను విడుదల చేసింది. అందులో ట్రంప్ అగ్రస్థానంలో నిలిచారు. అతని వివరాలు తెలుసుకునేందుకు ఎక్కువమంది ప్రజలు ఆసక్తి చూపించారట.
అనంతరం ట్రంప్ ఎన్నికల ప్రచారంలో వాడిన అంశాల గురించి కూడా ఎక్కువమంది సెర్చ్ చేశారు. అందులో వలసదారులు, గర్భస్రావం, ఐసిస్, ఆర్థికవ్యవస్థ అనే పదాలు ఉన్నాయి. హిల్లరీ కంటే ట్రంప్ గురించే నెటిజన్లు అధిక సమాచారం వెతికారు.
ఇకపోతే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ కొత్త రికార్డును సృష్టించింది. అమెరికన్ ఎన్నికల సందర్భంగా నెటిజన్లు 35 మిలియన్ల ట్వీట్లు చేస్తే.. 2012 ఎన్నికల సమయంలో 31 మిలియన్ల ట్వీట్లు చేసినట్లు ఓ నివేదిక వెల్లడించింది. భారత కాలమానం ప్రకారం ఉదయం 7.30 గంటల సమయానికి ఎన్నికలకు సంబంధించి 35 మిలియన్ల ట్వీట్లు నమోదైనట్లు యూఎస్‌ఏ రిపోర్ట్ పేర్కొంది.
కాగా.. అమెరికా అధ్యక్ష బరిలో రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఎకౌంట్‌కు 13.1 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా, డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ను 10.4 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.