ఫేస్‌బుక్‌కు జుకర్‌బర్గ్‌ గుడ్‌బై??

సోమవారం, 18 అక్టోబరు 2021 (08:55 IST)
ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు, ప్రస్తుత సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ (37) రాజీనామాకు సిద్ధమయ్యాడని బ్రిటన్‌కు చెందిన ఓ ప్రముఖ టాబ్లాయిడ్‌ సంచలన కథనం ప్రచురించింది. 
 
డిజిటల్‌ ప్రపంచంలో ‘మెటావర్స్‌’ ద్వారా అద్భుతాల్ని సృష్టించాలని ఫేస్‌బుక్‌ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఈయూ వ్యాప్తంగా 10వేల మంది అధిక నైపుణ్యం ఉన్న ఉద్యోగుల్ని వచ్చే ఐదేళ్లలో ఫేస్‌బుక్‌  నియమించుకోబోతోంది.

అయితే ఈ నియామకాల కోసం జరిగిన కీలక సమావేశంలో సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. సమీప భవిష్యత్తులో తాను వ్యవహారాల్ని పర్యవేక్షించినా.. లేకున్నా ఫేస్‌బుక్‌ను సమర్థవంతంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత ప్రతీఒక్కరి మీదా ఉందంటూ జుకర్‌బర్గ్‌ వ్యాఖ్యలు చేశాడట.

ఈ మేరకు ఫేస్‌బుక్‌ అంతర్జాతీయ వ్యవహారాలు చూసుకునే ఓ కీలక ఉద్యోగి ఇచ్చిన సమాచారం మేరకు కథనం ప్రచురించినట్లు సదరు టాబ్లాయిడ్‌ పేర్కొంది. 
 
యూజర్ల డాటా లీకేజీ గురించి ఫేస్‌బుక్‌ ఎప్పటి నుంచో విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.  ఇదీగాక ఇన్‌స్టాగ్రామ్‌తో మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందంటూ ఫేస్‌బుక్‌ మాజీ ఉద్యోగిణి ఫ్రాన్సెస్‌ హౌగెన్‌ సంచలన ఆరోపణలు చేస్తూ వస్తోంది.

యూజర్‌ భద్రత కంటే లాభాలే ఫేస్‌బుక్‌కు పరమావధిగా మారిందని ఆమె తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ తరుణంలో ఫేస్‌బుక్‌ కంపెనీలో సంస్కరణల దిశగా అడుగువేయాలని కోరుతూనే.. కంపెనీ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ను  ఆ పదవి నుంచి తొలగించాలని పెద్ద ఎత్తున్న ఉద్యమం నడుస్తోంది.

అంతేకాదు నవంబర్‌ 10న ‘క్విట్‌ ఫేస్‌బుక్‌’  పేరుతో ఒక్కరోజు ఫేస్‌బుక్‌, దాని అనుబంధ యాప్‌లను వాడొద్దంటూ పెద్ద ఎత్తున్న క్యాంపెయిన్‌ నడిపిస్తున్నారు. ఈ క్రమంలో యూజర్ల అసంతృప్తి బయటపడింది.

ఈ వరుస పరిణామాలన్నింటితో ఫేస్‌బుక్‌ కంపెనీ బోర్డులో కొందరు సభ్యులు జుకర్‌బర్గ్‌ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నట్లు సదరు కథనం ప్రచురించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు