చిరంజీవి రాజకీయాలపై భవిష్యత్తే తేల్చాలి: ఉదయ్

పలు విజయవంతమైన చిత్రాలు చేసి వెండితెరపై లవర్ బాయ్‌గా ఇమేజ్‌ను ఆపాదించుకున్నాడు ఉదయ్ కిరణ్. ఆ ముద్ర నుంచి మాస్‌ను ఆకట్టుకోవాలని చేసిన "శ్రీరామ్" ప్రయత్నం బెడిసికొట్టింది. విమర్శలెదురైనా దానిని ఇష్టపడేవారంతా మళ్లీ అటువంటి ప్రయత్నం ఎప్పుడు చేస్తారా అని ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం తాను చేసిన "ఏకలవ్‌యుడు"లోని పాత్రలో కొన్ని అటువంటి ఛాయలుంటాయని చెబుతున్న ఉదయ్ కిరణ్... అటు సినిమా పరంగా, ఇటు రాజకీయ పరంగా పలు విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా అవి మీ కోసం...

ప్రశ్న... గుండెఝల్లుమంది ఎటువంటి ఫలితాలనిచ్చింది?
జ... స్క్రీన్‌ప్లే బేస్డ్ ప్రేమకథ. ప్రేక్షకులు బాగుందని తీర్పిచ్చారు. ఇప్పుడు చేసిన ఏకలవ్‌యుడుకు కథే ప్రధానం. ఈ కథలో ఎన్నో నచ్చిన అంశాలున్నాయి. ఎన్నో ములుపులూ ఉన్నాయి. 80-90 దశకంలో కథలు అలా ఉండేవి. రాను రాను ఓ పాయింట్ బేస్‌చేసే స్క్రీన్‌ప్లే చిత్రాలు వచ్చాయి. అందుకే కథాబలమున్న చిత్రాన్నే ఎంచుకున్నా. ఇప్పటి వరకు నేను చేసిన వాటిల్లో ఫ్రెష్ కాన్సెప్ట్ ఈ చిత్రంలోని కథాంశమే. ఇంటర్‌వెల్ తర్వాత సెకండాఫ్ ప్రేక్షకుల ఊహకు అందని విధంగా ఉంటుంది.

ప్రశ్న... అసలు ఏకలవ్‌యుడు ఏం చేస్తాడు?
జ... తండ్రి మాట జవదాటని పాత్ర చేస్తున్నా. డిగ్రీ అయిన తర్వాత ఉద్యోగాన్వేషణ. ఈలోగా కుటుంబబాధ్యతలు. వాటికి పెద్ద పీఠ వేసి ముందుకు సాగే పాత్ర నాది. పురాణాల్లో చదివిన ఏకలవ్యుడు.. మాటకు కట్టుబడి ఉండేవాడు. గురువు కోరడంతో బొటన వ్రేలును ఇచ్చినవాడు. మరి ఈ ఏకలవ్‌యుడు... ప్రేమకోసం, తను ప్రేమించిన వారికోసం ఏం చేశాడన్నదే కథ. అది ప్రియురాలి ప్రేమా? తల్లిదండ్రుల ప్రేమా? అనేది చూసి తెలుసుకోవాల్సిందే.

ప్రశ్న.. ఒక్కసారి మీ చిత్రాలను బేరీజు వేసుకుంటే ఎలా అనిపిస్తుంది?
జ.. ఇంతకుముందు లవర్‌బాయ్‌గా చేశాను. చాలామంది నా నుంచి కొత్తగా ఆశిస్తున్నారు. అందుకే ఈ చిత్రం నాకొక పరీక్షలాంటిది. "మనసంతా నువ్వే"లో చెల్లెలు పెళ్లికోసం ఏదైనా చేసే వ్యక్తిగా... "నువ్వు నేను"లో ప్రేమకోసం కసిగా ఏదైనా చేసే పాత్రను... "శ్రీరామ్"లో ప్రేమకాకుండా ఇంకో కోణంలో మాస్‌ టచ్ ఉన్న పాత్రను పోషించాను.

అలాంటి భిన్నమైన కథతో కూడినదే తాజా చిత్రం. ఇప్పుడు పరిస్థితులు చాలా మారాయి. నేను ఇండస్ట్రీకి వచ్చి 8 ఏళ్లైంది. అప్పటికీ ఇప్పటికీ ఎంతో తేడా ఉంది. ముఖ్యంగా అందరిలోనూ ఓపికలు తగ్గాయి. ఒకప్పుడు సినిమాలు సిల్వర్ జూబ్లీలు, వంద రోజులు ఆడేవి. ఇప్పుడు ఎన్నివారాలు ఆడుతున్నాయి? 50 రోజులు ఎప్పుడు అవుతుందా అని చూసి గ్రాండ్‌గా ఫంక్షన్‌లు చేస్తున్నారు.

ప్రశ్న... ఫెయిల్యూర్ నుంచి ఏం నేర్చుకున్నారు?
జ... నా గత చిత్రాలు కొన్ని సక్సెస్ కాలేదు. రొటీన్ కథలు, చేసిన పాత్రలే మళ్లీ చేయడంతో మొహమెత్తడంతో ఇలా జరిగింది. వాటిని బ్రేక్ చేసి చాలా ఇన్‌ట్రెస్ట్ అయ్యే కథతో రావాలని ముందుకు వచ్చాను. 2005లో "ఏకలవ్‌యుడు" కథను దర్శకుడు కె.ఆర్.కె చెప్పారు. సరైన నిర్మాత దొరకక ఆలస్యమైంది.

కొంతమంది దొరికినా సక్సెస్ లేకపోవడంతో మెల్లగా జారుకునేవారు. మరికొంత మంది మూడు ముక్కల్లో చెప్పమనేవారు. అందుకే గతంలో ఫెయిల్యూర్స్‌ను దృష్టిలో పెట్టుకుని తగు జాగ్రత్తలు తీసుకుని కథలు ఎంపిక చేస్తున్నాను. అందులో వచ్చిన కథలే "గుండెఝల్లుమంది", "ఏకలవ్‌యుడు" చిత్రాలు.

WD
ప్రశ్న... ఆనాటి ఉదయ్‌కిరణ్ స్థాయికి ఎదగగలరా?
జ.... చాలా మంది అడుగుతున్నారు. మనిషి ఆశాజీవి. ఆ ఆశతోనే ఏదైనా సాధించాలి. అదే లేకపోతే నేను ఈ పాటికి వేరే ఫీల్డులో ఉండే వాడిని. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా... ఆ టైమ్‌లో.. ఆ ఫీల్డ్ వదిలేద్దామా? అనిపించేది. ఎక్కడ పోగుట్టుకుంటే అక్కడే వెతుక్కోవాలన్న చందంగా.. మళ్లీ హీరోగా ఉన్నత స్థితికి రావాలంటే ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నా.. ఆ స్థితికి రావాలంటే.... మంచి కథలున్న చిత్రాలు రావాలి.

అవి వస్తాయనే పట్టుదలతో ఉన్నా. ఆ పట్టు విడవలేదు. "ఏకలవ్‌యుడు"లో నా టాలెంట్‌ను నమ్ముకుని ముందుకు సాగాను. ఇందుకు మేడికొండ మురళీకృష్ణ, అమర్‌చంద్‌లు ఎంతో సహకరించారు.

ప్రశ్న... నిర్మాతకూ, మీకూ గొడవలొచ్చాయి... దీనికి కారణమేమిటి?
జ... నిర్మాతకూ, నాకూ మధ్య విభేదాలున్నాయని ఫిలింఛాంబర్ దృష్టికి వెళ్లిన మాట నిజమే. అది అపార్థం వల్ల జరిగింది మినహా పెద్ద తప్పేమీ కాదు. పెళ్లయినా, సినిమా అయినా అన్ని ఎమోషన్స్ ఉంటాయి. అలాంటిదే ఈ సంఘటన కూడా. ఉన్నది ఉన్నట్లు మాట్లాడే తత్త్వంనాది. దానివల్ల చిన్నపాటి మనస్పర్థలు రావచ్చు. చిత్రమంటేనే సమిష్టి కృషి. అందిరిని కలుపుకునే ప్రయత్నంలో పొరపాటున అపార్థం చేసుకోవడం సహజం.

ప్రశ్న... చిరంజీవికి పోటీగా కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేస్తారా?
జ... ఈ వార్తను నేను చదివాను. రాజకీయాలపై నాకు పూర్తి అవగాహన లేదు. కాంగ్రెస్ వారు నాకు పార్టీ టిక్కెట్ ఇస్తున్నారనే వార్తను ఏదో నెట్‌లో చూశాను. బేసిక్‌గా నాకు పొలిటికల్ నాలెడ్జ్ పూర్. ఇప్పటివరకు మూడుసార్లు ఓటు వేశాను. నాకిష్టమైన ప్రభుత్వానికే వేశాను. ఇప్పుడు ఎవరికి వేస్తాననేది నిర్ణయించేందుకు ఇంకా చాలా సమయముంది.

ప్రశ్న... హీరోగా.. చిరు అనే హీరో రాజకీయాల్లోకి రావడంపై మీ స్పందన?
జ... హీరోగా వెలుగొందిన చిరంజీవి రాజకీయ పార్టీ పెట్టారు. నెగ్గుతారా? అని చాలామంది అడుగుతున్నారు. నెగ్గుతారా? లేదా? అనేది భవిష్యత్‌లోనే తెలుస్తుంది.

ప్రశ్న... దర్శకులను శాసిస్తుంటారని వార్తలు వస్తున్నాయి?
జ... దర్శకులకు సలహాలిచ్చే స్థాయిలేదు. అదేవిధంగా... ఒక సినిమాను పక్కనపెట్టి మరో సినిమా చేస్తున్నారనే వార్తలూ విన్నాను. కానీ నాకాస్థాయి లేదు. యాదృశ్చికంగా ఒక్కోసారి ముందు ప్రారంభమైన సినిమా ఆలస్యంగా విడుదలవుతుంది. అలా జరిగిందే... "ఏక‌లవ్‌యుడు".