బాహుబలి ఒకెత్తు.. నా గత సినిమాలన్నీ ఒకెత్తు.. బాహుబలి-2 విడుదల తర్వాత ప్రభాస్ తొలి ఇంటర్వ్యూ..

సోమవారం, 22 మే 2017 (08:37 IST)
బాహుబలి 2  దేశవ్యాప్తంగా ఇంకా రికార్డులు బద్దలు చేస్తూ దూసుకుపోతోంది. నాలుగేళ్లకు పైగా తన కెరీర్‌ను బాహుబలి కోసం పణంగా పెట్టిన చిత్ర కథానాయకుడు ప్రభాస్ తానింకా బాహుబలి మూడ్ లోంచి బయటకు రాలేకపోతున్నానని చెబుతున్నాడు. సుదీర్ఘ కాలం ఒకే సినిమాకోసం షూటింగులోనే గడిపిన ప్రభాస్ ఇప్పుడు అమెరికాలో తన స్నిహితులకో కలిసి విశ్రాంతి తీసుకుంటున్నాడు. బాహుబలి 2 కంక్లూజన్ థియేటర్లలో విడుదలైనప్పటినుంచి జాతి మొత్తం  కధానాయకుడిగా ప్రభాస్‌కు నీరాజనం పలుకుతోంది. ఎస్ఎస్ రాజమౌళి తీసిన ఎపిక్ డ్రామా దేశంలో, ప్రపంచంలో ఒకదాని వెంట మరొకటిగా రికార్డులను బద్దలు చేస్తూ పోతోంది. కానీ ఈ మొత్తం విజయంలో కీలకపాత్ర పోషించిన ప్రభాస్ తనకు వస్తున్న కీర్తి ప్రతిష్టలకు, గుర్తింపుకు దూరంగా నాలుగేళ్లపాటు సాగించిన నిరంతర శ్రమ కారణంగా తప్పనిసరిగా తీసుకోవలసిన విశ్రాంతి కోసం దేశం బయట ఉంటున్నాడు. మీడియాతో మాట్లాడాలంటే బిడియపడే ప్రభాస్ బాహుబలి 2 విడుదల తర్వాత తన తొలి ఇంటర్వూలో బాహుబలి విశేషాలను పంచుకున్నారు. 
 
బాహుబలి ప్రమోషన్ల సమయంలో ఏవిధంగానేనా సరే.. విరామం తీసుకోవలసిందే అని చెప్పారు కదా?
అవును. నిజమే. బాహుబలి షూటింగ్ పార్ట్ పూర్తి చేయగానే నా మనసులో వచ్చిన తొలి ఆలోచన ఏదంటే ఎక్కడికైనా విరామంకోసం వెళ్లిపోవాలనే. ఇన్నాళ్ల తర్వాత నేను సెలవు తీసుకునే హక్కు నాకు లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. 
 
దేశవ్యాప్తంగా బాహుబలి 2కి ఇంత స్పందన వస్తుందని ఊహించారా?
ప్రారంభం నుంచి కూడా మేము ఒక ప్రత్యేకమైన చిత్రంలో భాగమై ఉన్నామని మాకందరికీ తెలుసు. కానీ ప్రేక్షకులు మాపై చూపుతున్న ప్రేమాభిమానాలు, అభినందనలు ఈ స్థాయిలో ఉంటాయని ఎన్నడూ ఊహించలేదు. ఈ సినిమా గురించి జనం ఏం చెప్పుకుంటున్నారో మా కుటుంబం, స్నేహితులు చెబుతున్న విషయాలు నా దృష్టికి వస్తున్నాయి. నిజం చెప్పాలంటే ప్రేక్షకుల అభినందనలకు నేను ఎన్నటికీ కృతజ్ఞతా బద్దుడినై ఉంటాను. 
 
ఇంత గొప్ప స్పందన తర్వాత బాహుబలి 3 ని ప్రారంభించాలని అనుకుంటున్నారా?
ఈ ప్రశ్నకు చిత్ర నిర్మాతలే సరైన జవాబు చెబుతారని భావిస్తున్నాను.  నాకు సంబంధించినంతవరకు బాహుబలి పాత్రను నేను చివరి వరకు ప్రేమిస్తూనే ఉంటాను. బాహుబలిని జీవితంలో మర్చిపోయే ప్రశ్నే లేదు.
 
మీరిప్పుడు జాతీయ స్ధాయి హీరో అయ్యారు. దీనికి గర్వంగా ఫీలవుతున్నారా?
నిజం చెప్పాలంటే నేనిప్పటికీ బాహుబలి మూడ్ లోనే ఉన్నాను. ఈ మూడ్ లోంచి బయటపడ్డాక నేనేం ఫీలవుతున్నానో అప్పుడు మీకే చెబుతాను.
 
బాహుబలి చిత్రం కోసం పనిచేయడం మొదలెట్టినప్పటినుంచి మీరు ఏ ఇతర సినిమానూ చేయలేదు. బాహుబలి 1, 2 భాగాల కారణంగా ఏదయినా మిస్సయ్యారని భావిస్తున్నారా?
అదేమీ కాదు. ఇలాంటి సినిమా కోసం నా జీవితంలో ఏడేళ్లు ఇవ్వాలన్నా ఇచ్చేవాడిని. నేను నిజంగా అంకితభావం, నిబద్ధత ప్రదర్శించాల్సిన సినిమా ఇదే అని నేను మొదట్లోనే గుర్తించాను. ఒక్కసారి ఊహించండి. చిత్రం యాక్షన్ పార్ట్‌కే 300 రోజులు పట్టింది. సినిమా షెడ్యూల్స్ కూడా చాలా కఠినంగా ఉండేవి. విభిన్న పాత్రల కోసం విభిన్న రూపాల్లో నేను కనిపించాల్సిన అవసరం ఉండేది. కాబట్టి నేను ఏమయినా సాధించానంటే బాహుబలి సీరీస్ నుంచి నేనెంతో ప్రయోజనం పొందాననిపిస్తోంది.
 
బాహుబలి సినిమా రెండు భాగాల్లో నటించడం కోసం నాలుగేళ్ల పాటు మీరు మరే సినిమానూ అంగీకరించనందున, డబ్బుకు చాలా ఇబ్బంది పడ్డారని ఇటీవలే రాజమౌళి చెప్పాురు. నిజమేనా? 
ప్రారంభంలో బాహుబలి రెండేళ్లలో పూర్తవుతుందని అనుకున్నాం. (నవ్వుతూ) కానీ అలా సాధ్యం కాకపోవడంతో నిజంగానే చాలా ఇబ్బందికరమైన పరిస్ధితులను ఎదుర్కొన్నాను. నాకు ఏర్పడిన కష్టం సామాన్యమైంది కాదు. నా స్నిహితులు, కుటుంబ సభ్యులు కూడా మరో సినిమాను ఒప్పుకోవాలసిందిగా ఒత్తిడి పెట్టారు. కానీ నేను రాజమౌళి గారిపై నమ్మకం ఉంచాను. కఠిన సమయాలే కఠిన నిర్ణయాలకు దారితీశాయి. (నవ్వుతూ) 
 
సినిమా అంచనాలు భారీగా ఏర్పడటంతో విడుదలకు ముందు ఒత్తిడి ఎదుర్కొన్నారా?
అవును. భారీ బడ్జెట్, గ్రాండ్ రిలీజ్, చాలా భాషల్లో విడుదల చేయవలసి రావడం వంటివి కాస్త ఊహించండి. ఎవరైనా దీన్ని తేలికగా తీసుకోగలరా? నా కెరీర్ ‌లోనే ఇంత ఉద్వేగాన్ని నేనెన్నడూ చవి చూడలేదు. దాన్ని మాటల్లో వర్ణించడం కూడా నాకు కష్టమే. నా మొత్తం సినిమాలన్నీ ఒకెత్తు, బాహుబలి ఒక్కటే ఒకెత్తుగా భావిస్తున్నాను. షూటింగ్ సమయంలో చాలా టెన్షన్ ఉండేది. ప్రతి ఒక్కరూ నేను చేస్తున్న పని పట్ల సంతృప్తి చెందుతున్నారా లేదా అనే దానిమీదే ఎక్కువగా దృష్టి పెట్టాను. 
 
ఈ సినిమా ద్వారా మీరు అందుకున్న ఉత్తమ అభినందన ఏది?
బాహుబలి పాత్రను నాకోసం రాజమౌళి గారు రాయడమే అతిగొప్ప అభినందన అని నేననుకుంటున్నాను. షూటింగ్ ప్రారంభం కాక ముందు, అంతటి శక్తివంతమైన పాత్రకు నేను ఎలా న్యాయం చేయగలను అనే ఆలోచనల్లో మునిగేవాడిని.
 
మీ తదుపరి చిత్రం సాహో కూడూ మూడు భాషల్లో వస్తోంది. దాని టీజర్ కూడా ఎంతో ఆసక్తిని రేపినట్లుంది కదా?
ఇప్పటికి నేను చెప్పేది ఏమిటంటే అది యాక్షన్‌తో కూడిన లవ్ స్టోరీ. కాని దానిగురించి ఇప్పేడే చెప్పడం కష్టం. త్వరలోనే మరిన్ని వివరాలు చెబుతాను.
 
థాయ్‌లాండ్‌లోని మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో విగ్రహం ఉంచుతున్న మొట్టమొదటి దక్షిణాది స్టార్ మీరే కదా. మీకు చాలా  సంతోషంగా ఉంది కదా?
అది చాలా గొప్ప అనుభూతి. బాహుబలి తర్వాత నా జీవితంలో చాలా పరిణామాలు జరుగుతున్నాయి. చాలావిషయాల్లో నా జీవితంలో మార్పులు జరిగాయి కూడా.
 
మరిన్ని తెలుగు ప్రాజెక్టులు కూడా మొదలెడుతున్నారు. కొంచెం తేలికగా ఉండే చిత్రాలు చేయాలని అనుకుంటున్నారా?
బాహుబలి వంటి సినిమాలు జీవితంలో ఒక్కసారే వస్తాయి. పైగా అమరేంద్ర బాహుబలి వంటి పాత్రను నా జీవితంలోనే మర్చిపోలేను. ఇప్పుడు అంటే నాలుగేళ్ల తర్వాత ఏదైనా భిన్నంగా చేయాలనుకుంటున్నాను. 
 
హిందీ సినిమా నిర్మాతల నుంచి మీకు చాలా ఆఫర్లు వస్తున్నట్లు పుకార్లు వస్తున్నాయి. బాలీవుడ్‌లో అడుగుపెట్టాలనుకుంటున్నారా?
ఇప్పటికైతే నా స్నేహితులతో, కుటుంబంతో వీలైనంత ఎక్కువగా గడపడమే నా ప్రాధాన్యత. తర్వాత సాహో చిత్రంలో నా పాత్రకు సిద్ధమవుతాను. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం (నవ్వుతూ)
 

వెబ్దునియా పై చదవండి