మా ఊరిలో నన్ను సుకుమార్‌ అనే పిలుస్తుంటారు: బుచ్చిబాబు సాన

బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (22:35 IST)
Uppena director Buchibabu
సుకుమార్ శిష్యుడుగా `ఆర్య2, 100% లవ్‌, కుమారి 21ఎఫ్‌, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, 1 నేనొక్కడినే` సినిమాలకు పనిచేసిన బుచ్చిబాబు సాన `రంగ‌స్థ‌లం` చిత్రీక‌ర‌ణ‌లో వుండ‌గా `ఉప్పెన‌` క‌థ చెప్పాన‌ని అంటున్నాడు. చాలా బాగుంద‌ని మా గురువుగారు మెచ్చుకున్నారు.

అలాంటి క‌థ‌ను మా గురువుగారు బేన‌ర్‌లో చేయ‌డం అదృష్టంగా భావిస్తున్నాన‌ని` ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు సాన తెలియ‌జేస్తున్నాడు. హీరో వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి జంటగా నటిస్తున్న ఈ ప్రేమకథా చిత్రంలో విజయ్‌సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం ఈ నెల‌12 విడుదల కానుంది. ఈ నేపథ్యంలో బుచ్చిబాబు విలేక‌రుల‌తో ప‌లు విష‌యాలు తెలియ‌జేశారు.
 
ప్రీరిలీజ్‌లో నేనెవ‌రిని శిష్యుడు అని అన‌ను అన్నారు సుకుమార్‌గారు. మ‌రి మిమ్మ‌ల్ని ఎలా అన‌గ‌లిగారు?
ఇంటర్మీడియట్‌లో సుకుమార్‌ గారు మాకు లెక్క‌ల మాస్ట‌ర్‌. ‘సినిమాల్లోకి వెళతాను’ అని ఆయన కొంతమందితో మాత్రమే చెప్తుండేవారు. ఆ నలుగురైదుగురిలో నేనొకడిని. అలా ఆయనతో కలిసి సినిమాలకు వెళ్లడం, ఆయన రాసుకున్న కథలు వినేవాడిని. ఆయన దగ్గర..  ఎంబీఏ చేస్తూనే ఆయన దగ్గర అసిస్టెంట్‌గా చేశాను. మా ఊరిలో నన్ను సుకుమార్‌ అనే పిలుస్తుంటారు. అంత‌లా ఆయ‌న‌తో నాకు అనుబంధం వుంది. ఇరవయేళ్ల నుంచి ఆయన దగ్గర ఉంటున్నాను. ఆయన నాకు ఏ సమయంలో ఎంత ఇవ్వాలో అంతా ఇస్తూ వస్తున్నారు. ఈ భూమ్మీద మా గురువులా స్క్రిప్టు ఆలోచించేవారు మరెవరూ లేరు. బుచ్చిబాబు డైరెక్టర్‌ అనేదానికంటే.. సుకుమార్‌ అసిస్టెంట్‌ అంటేనే నాకిష్టం.
 
రెండురోజుల్లో సినిమా విడుద‌ల కాబోతుంది. ఎలా వుంది మీ ప‌రిస్థితి?
పరీక్ష రాసి ఫలితం కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న విద్యార్థిలా వుంది. నాకూ ఎక్కువ‌ టెన్ష‌న్ వుంది.
 
రంగ‌స్థ‌లం లాంటి క‌థ అంటే మ‌ళ్ళీ అదే త‌ర‌హా సినిమాలా వుంటుందా?
కానే కాదు. కేవ‌లం పోలిక మాత్ర‌మే. నేను సుకుమార్‌ గారి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసేటప్పుడే చాలా కథలు రాసుకున్నాను. నేను మా ఇంటి గడప నుంచి వెతకడం మొదలుపెడతా. మా ఇల్లు,  ఎదురిల్లు, వీధి, ఊరు.. ఇలా అక్కడే ఎన్నో అందమైన కథలు దొరుకుతాయి. నా కథలు సుకుమార్‌గారికి కూడా చెప్పాను. ఇంకా రాయ్‌ చూద్దాం అనేవారు.

‘రంగస్థలం’ తీసేటప్పుడు ఆయనకు ఈ కథ చెప్పాను. ఆయనకు బాగా నచ్చింది. చాలా బాగుందని మెచ్చుకున్నారు కూడా. తమిళ సినిమాలు చూసేటప్పుడు.. మన తెలుగులో ఇలాంటి సినిమాలు ఎందుకు రావడం లేదు అనిపించేది. అయితే.. అన్ని కథలకు ఆ బ్యాక్‌డ్రాప్‌ సెట్‌కాదు. మా అదృష్టం కొద్ది ఈ సినిమాకు సెట్‌ అయింది.
 
ఎంతోమంది హీరోలుండ‌గా ఏ మాత్రం అనుభ‌వంలేని వారిని హీరోగా ఎంపిక‌చేశారే?
ఈ కథకు కొత్త కుర్రాడు కావాలి. కథ రాసిన తర్వాత ఎవరైతే ఈ సినిమాకు న్యాయం చేయగలరని వెతకడం మొదలుపెట్టాను. మెగాఫ్యామిలీ నుంచి వైష్ణవ్‌తేజ్‌ ఈ కథకు బాగా నప్పుతాడని అనిపించింది. ఆయనకు కథ చెప్పాను. నిజానికి వైష్ణవ్‌ లేకపోతే ‘ఉప్పెన’ ఒంటరి అయిపోయేది. అంతబాగా చేశాడు. ఈ కథను జాతీయస్థాయిలో చెప్పాలనుకున్నా.

అందుకే విజయ్‌సేతుపతిగారిని తీసుకున్నాను. కథ విన్న తర్వాత ఆయన కూడా చాలా సంతోషించారు. ఈ సినిమా ‘96’ కంటే పెద్ద హిట్‌ కొట్టబోతుందని చెప్పారు. ఈ కథ ఎవరికి చెప్పినా సరే ఈ సినిమాలో విజయ్‌సేతుపతి విలన్‌ అని ముందునుంచి చెప్తూ వస్తున్నా. చిరంజీవిగారికి కథ చెప్పగానే.. ‘హిట్‌ ఫార్ములా ముందే రాసేశావ్‌’ అన్నారు.
 
ఎన్టీఆర్‌కు చెప్పిన క‌థ ఇదేనా?
నాన్నకు ప్రేమతో సమయంలో వేరే కథ చెప్పాను. అది కూడా బాగుందని ఆయన మెచ్చుకున్నారు. అక్కడి నుంచి ఏ హీరోకైనా కథ చెప్పగలననే ధైర్యం వచ్చింది. నేను చేసే ప్రతి కథ అందరికీ నచ్చుతుందని నమ్ముతా. ఎందుకంటే నేను రాసేది మట్టిలో నుంచి పుట్టిన కథలు. మీకు సినిమా చూస్తున్నట్లు అనిపించదు. అందరూ కథలో లీనమైపోతారు. క్లైమాక్స్‌ మాత్రం అందరి హృదయాలను కచ్చితంగా బరువెక్కిస్తుంది.
 
విజయ్‌సేతుపతికి అంత ప్రాధాన్య‌త వుందంటారా?
ఈ సినిమా విజయ్‌గారితో మొదలై ఆయనతోనే ఇంటర్వెల్‌ పడటంతో పాటు ఆయనతోనే ముగుస్తుంది. ఆయనను ఈ సినిమాకు ఎందుకు తీసుకున్నామో.. సినిమాలో క్లైమాక్స్‌ చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది.
 
ఈ క‌థ‌ను హీరోల భాష‌లో ఒక్క మాట‌లో చెప్పాలంటే ఎలా చెబుతారు?
ఈ సినిమా గురించి ఒక్కమాటలో చెప్పాలంటే, కూతురిది ఉప్పెనంత ప్రేమ. తండ్రిది ఉప్పెనంత కోపం.
 
సాయిచంద్‌గారి పాత్ర ఎలా వుంటుంది?
సాయిచంద్‌గారి పాత్ర ఈ సినిమాలో కొన్నిసార్లు విజయ్‌సేతుపతిని డామినేట్‌ చేస్తుంది. ఆయనకు కథ నచ్చడంతో ఈ సినిమాకు ఆయన రెమ్యునరేషన్‌ కూడా తీసుకోలేదు. చెక్‌ పంపించి ప్లీజ్‌ తీసుకోండి సర్‌.. అని బ్రతిమాలినా సరే వద్దన్నారు.
 
సినిమా గురించి దేవీశ్రీ‌ప్ర‌సాద్ నుంచి ఎలాంటి స్పంద‌న వ‌చ్చింది?
నాక్కూడా సంగీతం అంటే చాలా ఇష్టం. కొన్ని వేల పాటలను లిరిక్స్‌తో పాటు పాడేస్తా. చెన్నై వెళ్లి దేవిశ్రీప్రసాద్‌గారికి కథ చెప్పాను. అయిపోగానే డీఎస్పీ సుకుమార్‌గారికి ఫోన్‌ చేశారు. ‘మిమ్మల్ని పొగడాలా..? మీ శిష్యుడిని పొగడాలా..?’ అన్నారు. అంత‌లా ఆయ‌న‌కు న‌చ్చింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు