సితార నటిని చేస్తే స్టార్ హీరోయిన్ అవుతుంది... 8 నెలలు బాగా కష్టపడ్డా: సమంత
మంగళవారం, 10 మే 2016 (19:32 IST)
తెలుగులో చాలా బిజీ హీరోయిన్గా అవడం అదృష్టమనీ.. ఇలా గత 8 నెలలుగా నాలుగు సినిమాల్లో చాలా బిజీగా ఉన్నాను. ఓ దశలో విశ్రాంతి తీసుకుందామని.. కొన్ని రోజులు షూటింగ్ ఆపేద్దామని అనిపించింది. ఆ దశలో ఓపికలేక ఏడ్చేశాను.. అని నటి సమంత తెలియజేస్తుంది. తమిళ 'థెరీ' (పోలీస్), '24', 'బ్రహ్మోత్సవం', 'అ..ఆ..' తర్వాత 'జనతాగ్యారేజ్'.. ఇలా వరుస చిత్రాల్లో బిజీగా వున్న ఆమె.. 24 సినిమాలోని తన పాత్రగురించి.. ఫ్యూచర్ గురించి ఈ విధంగా తెలియజేస్తుంది.
* ఏదో ప్లాన్ ప్రకారమే వరుసగా సినిమాలు విడుదలవుతున్నాయే?
నేనేదీ ప్లాన్ చేయను. వరుసగా అవకాశాలు వచ్చాయి. ఒక దశలో కొంతకాలం గ్యాప్ తీసుకున్నా. అయినా ప్రేక్షకులు నన్ను ఆదరించారు. చాలా సంతోషంగా ఉంది. 'తెరీ', '24', 'బ్రహ్మోత్సవం', 'అ..ఆ..' ఇలా నేను నటించిన నాలుగు సినిమాలు ఒకేసారి రావడం, అన్నీ దేనికవేభిన్నమైన కథలు కావడం నా అదృష్టం. 'తెరీ' బ్లాక్‌బస్టర్ అయిపోయింది. '24' కూడా అదేబాటలో సూపర్ రెస్పాన్స్‌తో వెళుతోంది. రేపొచ్చే రెండు సినిమాలు కూడా బ్లాక్‌బస్టర్ అవుతాయన్న నమ్మకం ఉంది. ఇంతకంటే నేను కోరుకునేది ఏముంటుంది.
* '24' కథ విన్నప్పుడు ఎలా అనిపించింది?
కొత్తగా అనిపించింది. బహుశా హాలీవుడ్లో ఈ తరహా చిత్రాలు చూసి ఉంటాం. తెలుగులో కొత్తది. విక్రమ్ కుమార్, సూర్య కాంబినేషన్ అనగానే పెద్ద ఇమేజ్ వచ్చేసింది. 'ఈగ' చేసినప్పుడు ఎలా అనిపించిందో అదే ఫీలింగ్ కల్గించింది.
* బిజీ వల్ల వ్యక్తిగత జీవితం కోల్పోతున్నాననే ఫీలింగ్ కలిగిందా?
నిజంగానే ఒక ఎనిమిది నెలలుగా సెలవంటూ లేకుండా సినిమాలు చేస్తున్నా. మొన్న ఒక రోజు తెరీ ప్రమోషన్స్, 24 ప్రమోషన్స్, బ్రహ్మోత్సవం షూట్, వేరే ఇంకేదో పని.. ఇవన్నీ ఒకేసారి గంటల తేడాలో వచ్చిపడ్డాయి. అప్పుడు మాత్రం నిజంగానే అరగంట పాటు ఏడ్చేశా. ఇకపై మాత్రం ఎక్కువగా సినిమాలు ఒప్పుకోవట్లేదు. నా వ్యక్తిగత జీవితానికి కూడా ఎక్కువ ప్రాధ్యాన్యతనివ్వాలని ఫిక్స్ అయిపోయా.
* ఇప్పుడు కూడా ఇంకా బిజీగానే ఉన్నట్టున్నారు?
ఇంకా బిజీగానే ఉన్నా. 'బ్రహ్మోత్సవం', 'అ.. ఆ..' రెండు సినిమాలు విడుదలయ్యాక, 'జనతా గ్యారెజ్' షూటింగ్ కూడా అయిపోతే ఇంక పూర్తిగా రిలాక్స్ అయిపోదామని అనుకుంటున్నా.
* అంటే సినిమాలు చేయరా?
అలా అనడంలేదు. కొంత విశ్రాంతి తీసుకుంటాను.
* 'బ్రహ్మోత్సవం', 'అ..ఆ..' సినిమాల్లో మీ రోల్స్ ఎలా ఉండబోతున్నాయి?
బ్రహ్మోత్సవంలో శ్రీకాంత్ అడ్డాల మార్క్ చలాకీ అమ్మాయి పాత్ర నాది. ఆయన సినిమాల్లో ప్రతి పాత్రకూ ఓ ప్రాధాన్యత ఉంటుంది. బ్రహ్మోత్సవంలో నా పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక త్రివిక్రమ్ అ.. ఆ... సినిమాలోనూ చాలా మంచి రోల్ చేశా. ఆ పాత్ర ద్వారా నన్ను చాలాకాలం గుర్తుపెట్టుకుంటారన్న నమ్మకం ఉంది.
* సీనియర్ హీరోయిన్ అయిపోయారు.. ఎలా అనిపిస్తుంది?
నన్ను సీనియర్ అంటే.. ఏదో తెలీని బాధ కలుగుతుంది. అంటే నేను ఇంకా ఇండస్ట్రీ వదిలివెళ్లలేదు. ఇక్కడే ఉన్నాను. అయినా నేనింకా అంత సీనియర్ అయిపోలేదు. అందుకే 'జనతా గ్యారెజ్' కోసం లుక్ కూడా మార్చేశా.
* చిరంజీవి 150వ సినిమాకు మిమ్మల్ని సంప్రాదించారని వినిపించింది. అది ఎంతవరకు నిజం?
అలాంటిదేమీ జరగలేదు. బహుశా చిరంజీవి గారి సినిమా 'కత్తి'కి రీమేక్ అవ్వడం వల్ల ఇందులో నేనూ నటిస్తున్నాననే వార్త వచ్చి ఉండొచ్చు.
* 24లో సూర్యకు అవార్డు వస్తుందనుకుంటున్నారా?
సూర్య మంచి నటుడు. నిర్మాత కూడా. ఆయన ఆలోచనలు తెరపై తీసుకురావడానికి నిర్మాత అవసరం. అందుకే ఆయన సినిమా తీశారు. ఆత్రేయ పాత్రలో ఆయన నటన అద్భుతం.. అవార్డు వస్తే దానికి వస్తుంది.
* మీతోపాటు మరో హీరోయిన్ కూడా వుంటే ఎలా అనిపిస్తుంది?
నాతోపాటు మరో హీరోయిన్ వున్నా.. పెద్దగా పట్టించుకోను. ఎవరి పాత్ర వారిది.. నా పాత్ర నాకు నచ్చింది. అదే చూసుకుంటాను.
* 'బ్రహ్మోత్సం' ఆడియోలో సితారతో కబుర్లు బాగా చెప్పారే?
నేను సితార మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ఈ మాట చెబితే వాళ్ళ నాన్న మహేష్ సీరియస్ అవుతరామో.. అయితే ఒకటి చెప్పగలను.. సితార హీరోయిన్గా చేస్తే స్టార్ హీరోయిన్ అవుతుంది. ఎందుకంటే తన నవ్వు, లుక్ చాలా బాగుంటాయి.
* ఇంకా ఒంటరిగానే వుంటున్నారా?
ఎవరు చెప్పారు? నేను కలిసే వుంటున్నాను.. మా ఫ్యామిలీతో.. మీ ప్రశ్నకు సమాధానికి సమయం పడుతుంది..అంటూ నవ్వేసింది.