శ్రీనిక క్రియేటివ్ వర్క్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం "2 అవర్స్ లవ్". ఈ చిత్రంతో శ్రీపవార్ హీరోగా పరిచయమవుతున్నారు. ఆయనే కథ రాసి, దర్శకత్వం వహించిన చిత్రమిది. కృతి గర్గ్ కథానాయికగా నటించారు. తనికెళ్లభరణి, నర్సింగ్ యాదవ్, అశోక వర్ధన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ నెల 6న (శుక్రవారం) విడుదల కానున్న ఈ సినిమా గురించి రచయిత, దర్శకుడు, హీరో శ్రీ పవార్ స్పందించారు.
* మీ గురించి చెప్పండి?
* నేను లోకల్ అండీ. నేను పుట్టింది, పెరిగింది ఇక్కడే. బాగా చదువుకున్నాను. ఐటీ జాబ్ చేశాను. ఐదేళ్ల పాటు ఆ ఉద్యోగం చేసి ఇప్పుడు సినిమాల్లోకి వచ్చాను. నాకు బేసిగ్గా రచన, దర్శకత్వం అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే ఏడాదిన్నర పాటు కూర్చుని కథ రాసుకున్నా.
* హీరో కావాలని కూడా ముందు నుంచీ ఉండేదా?
* అబ్బే లేదండీ. నేను రాసుకున్న కథ విజయ్ దేవరకొండకు చక్కగా సరిపోతుందనిపించింది. అప్పుడు ఆయన నటించిన 'పెళ్లిచూపులు' చూసి అలా ఫిక్సయ్యా. ఆ సినిమా విడుదలయ్యే నాటికి నా కథ 80 శాతం మాత్రమే లాక్ అయి ఉంది. ఆ మిగిలిన స్క్రిప్ట్‌ను లాక్ చేసే సరికి 'అర్జున్ రెడ్డి' విడుదలైంది. అప్పటికే ఆయన రెండు, మూడు సినిమాలు సైన్ చేశారు. ఇక అందనంత దూరం వెళ్లారు. సరేనని నేనే నటించడానికి ముందుకొచ్చా.
* ఇంకే హీరోకూ చెప్పాలనిపించలేదా?
* మరో ఇద్దరు, ముగ్గురికి చెప్పా. కానీ వారు మాట్లాడిన తీరు చూస్తుంటే నా కథలో వేలు పెడతారేమోనని అనిపించసాగింది. అందుకే వారితో వెళ్లాలనిపించలేదు. నాకు రైటర్‌గా, డైరక్టర్‌గా కాంప్రమైజ్ కావడం ఇష్టం లేదు. పైగా నేను సుకుమార్ సినిమాలను ఇష్టపడతాను. ఆయనలాగా సీన్స్, ఆయన థాట్ ప్రాసస్ నాకు చాలా ఇష్టం. అలాగని సినిమాలను చూసి కాపీ కొట్టను. ఒక సినిమాను చూసి కాపీ కొట్టి రాయడం నాకు నచ్చదు.
* మరి ఈ సినిమా కథ రాయడానికి స్ఫూర్తి ఏంటి?
* మన జీవితంలోని సంఘటనలన్నిటినీ సమాహారం చేస్తే సినిమా కథ అయిపోతుంది. అలా రాసుకుందే ఈ కథ. దీనికి మొదలు ఎక్కడ, ఏమేం స్ఫూర్తి అంటే చెప్పడం కష్టమేమో.
* టైటిల్ 'టూ అవర్స్ లవ్' అని పెట్టడానికి కారణం?
* సాయంత్రం నాలుగు గంటలకు ముందు, ఆరు గంటల తర్వాత ఏం జరిగినా ఆ అమ్మాయికి అస్సలు సంబంధం ఉందన్నమాట. హీరోయిన్‌కి ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. రొమాంటిక్ కామెడీ తరహా సినిమా. ప్రతి సీనూ ఎలా ఉండబోతుందోననే టెన్షన్ ఉంటుంది.
* సినిమా నిడివి కూడా రెండు గంటలే ఉంటుందా?
* లేదండీ. రెండుగంటలు దాటి ఉంటుంది.
* మీరు యాక్టింగ్ ఎక్కడా నేర్చుకోలేదు. మరెలా చేశారు?
* యాక్టింగ్ అనేది నేర్చుకుంటే వచ్చేది కాదని నా నమ్మకం. కాకపోతే మన యాక్టింగ్ స్కూళ్లన్నీ నటనకు మెరుగులు దిద్దుతాయి. రైటర్‌ని కూడా నేనే కాబట్టి, ఏ ఎమోషన్‌ని ఎలా పండించాలో తెలుసు.
* మిమ్మల్ని చూస్తే మరో హీరో గుర్తుకొస్తున్నారు..
* మీరు మంచి ఉద్యోగం వదిలేసి సినిమాల్లోకి వస్తానంటే మీవాళ్లు ఏమీ అనలేదా?
* లేదండీ. మా వాళ్లందరికీ సినిమాలంటే చాలా ఇష్టం. మా అమ్మావాళ్లు చిరంజీవిగారికి పెద్ద ఫ్యాన్స్.
* నెక్స్ట్ మీ ప్లాన్స్ ఏంటి?
* స్క్రిప్ట్ సిద్ధంగానే ఉంది.
* పీవీఆర్ సినిమాస్ విడుదల చేస్తోందా?
* అవునండీ. చిన్న సినిమా షో అని పిలవగానే అంత తేలిగ్గా ఎవరూ ముందుకు రారు. అలాంటిది మా సినిమా కాన్సెప్ట్ నచ్చి చాలా మంది సినిమా చూశారు. పీవీఆర్ వాళ్లకు కూడా అలాగే తెలిసి చూశారు. కంటెంట్ నచ్చి సినిమాను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే మా ట్రైలర్లకు, పాటలకు చాలా మంచి టాక్ వచ్చింది.
* సినిమాలో హైలైట్స్ ఏం ఉంటాయి?
* కథ హైలైట్. ప్రవీణ్ వనమాలి డీఓపీ హైలైట్ అవుతుంది. మా మ్యూజిక్ చేసిన ఇద్దరూ 'గూఢచారి'కి పనిచేసిన వాళ్లే. నటీనటులందరూ పేరున్నవాళ్లే. అయినా ఈ మధ్య 'బ్రోచేవారెవరురా', 'గూఢచారి' వంటి సినిమాలన్నీ హిట్ కావడంతో చిన్న సినిమాలకు మంచి ఆదరణ ఉంది.
* లొకేషన్సు ఎక్కడ?
* చిక్‌మగళూర్, బెంగుళూరు, ముంబై, గోవా, హైదరాబాద్ పరిసరాల్లో చేశాం. సినిమా స్క్రీన్ మీద ఫ్రెష్‌గా ఉంటుంది. తప్పక చూడండి.