ఐపీఎల్ 2020 : "సూపర్‌"గా పంజాబ్‌ను గెలిపించిన గేల్ - అగర్వాల్

సోమవారం, 19 అక్టోబరు 2020 (09:47 IST)
యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2020 పోటీలు సాగేకొద్దీ మరింత రసవత్తరంగా సాగుతున్నాయి. ఆదివారం జరిగిన రెండు మ్యాచ్‌లు అత్యంత ఉత్కంఠత మధ్య ముగిసాయి. ఈ రెండు మ్యాచ్‌ల ఫలితాన్ని సూపర్ ఓవర్ తేల్చింది. తొలుత సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్‌ను ఆడించారు. 
 
ఇందులో కేకేఆర్ జట్టు విజయం సాధించగా, హైదరాబాద్ జట్టు చేజేతులా ఓడింది. ఆ తర్వాత ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లోను ఇరు జట్ల స్కోరు సమం కావడంతో ఫలితాన్ని తేల్చేందుకు సూపర్ ఓవర్ నిర్వహించారు. ఇందులో పంజాబ్ జట్టును ఆ జట్టు ఓపెనర్ క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్‌లు జట్టును గెలిపించారు. 
 
కాగా, ఈ మ్యాచ్‌ వివరాలను పరిశీలిస్తే, ఆదివారం జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ - కోల్‌కతా నైట్‌రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ - ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లు ప్రేక్షకులను చివరి బంతి వరకు ఉత్కంఠకు గురిచేశాయి. అంతేకాదు, రెండు మ్యాచ్‌లు టై కాగా, సూపర్ ఓవర్‌కు దారితీశాయి. ముంబై - పంజాబ్ మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లోనూ టై కావడంతో మరో సూపర్ ఆడాల్సి వచ్చింది. ఒకే రోజు మూడు సూపర్ ఓవర్లు జరిగాయన్న మాట. ఈ సూపర్ ఓవర్లలో తొలుత కోల్‌కతా విజయం సాధించగా, ఆ తర్వాతి మ్యాచ్‌లో పంజాబ్ విజయం సాధించింది.
 
కాగా, పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. డికాక్ 43 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 53, కృనాల్ పాండ్యా 30 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ 34, పొలార్డ్ 12 బంతుల్లో ఫోర్, 4 సిక్సర్లతో 34, కౌల్టర్ నైల్ 12 బంతుల్లో 4 ఫోర్లతో 24 పరుగులు చేయడంతో ముంబై 176 పరుగుల భారీ స్కోరు చేసింది.
 
ఆ తర్వాత 177 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన పంజాబ్ కూడా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ 51 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు సాయంతో 77, క్రిస్ గేల్ 21 బంతుల్లో ఫోర్, 2 సిక్సర్ల సాయంతో 24, పూరన్ 12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 24, దీపక్ హుడా 16 బంతుల్లో ఫోర్, సిక్సర్‌తో 23, క్రిస్ జోర్డాన్ 8 బంతుల్లో 2 ఫోర్లు కొట్టి 13 పరుగులు చేశారు. అంటే నిర్ణీత 20 ఓవర్లలో సరిగ్గా 176 పరుగులే చేయగలిగింది. 
 
ఫలితంగా మ్యాచ్ టైగా ముగిసింది. అయితే, మ్యాచ్ ఫలితాన్ని తేల్చేందుకు సూపర్ ఓవర్ నిర్వహించగా, తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఆరు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయి 5 పరుగులు మాత్రమే చేసింది. దీంతో అద్భుతమైన బ్యాట్స్‌మెన్ కలిగిన ముంబైదే విజయమని భావించారు. 
 
కానీ, బౌలర్ మహ్మద్ షమీ అద్భుత బౌలింగుతో ముంబై పరుగులు చేయకుండా అడ్డుకున్నాడు. దీంతో తొలి 5 బంతుల్లో 4 పరుగులు రాగా, చివరి బంతికి ఒక పరుగు తీసి, రెండో పరుగుకు ప్రయత్నించే క్రమంలో డికాక్ రన్ అవుట్ అయ్యాడు. దీంతో మ్యాచ్ మరోమారు టై అయింది. ఫలితంగా విజేతను తేల్చేందుకు మరో సూపర్ ఓవర్ అనివార్యమైంది.
 
ఈసారి ముంబై జట్టు పొలార్డ్, హార్దిక్ పాండ్యాలను బరిలోకి దింపింది. అయితే, పంజాబ్ బౌలర్ జోర్డాన్ కట్టుదిట్టమైన బౌలింగు ముందు పరుగులు చేయలేకపోయారు. తొలి రెండు బంతులకు మూడు పరుగులు రాగా, మూడో బంతిని పొలార్డ్ బౌండరీకి తరలించాడు. నాలుగో బంతి వైడ్ కాగా, ఆ తర్వాతి బంతికి పాండ్యా రనౌట్ అయ్యాడు. ఐదో బంతి డాట్ బాల్. చివరి బంతికి పొలార్డ్ రెండు పరుగులు చేయడంతో ముంబై వికెట్ నష్టానికి 11 పరుగులు మాత్రమే చేసింది.
 
అనంతరం 12 పరుగుల విజయ లక్ష్యంతో పంజాబ్ బ్యాటింగ్ ప్రారంభించింది. విధ్వంసకర ఆటగాడు గేల్‌, అగర్వాల్‌ క్రీజులోకి వచ్చారు. బౌల్ట్ వేసిన తొలి బంతినే గేల్ సిక్సర్‌గా మలిచాడు. ఆ తర్వాతి బంతికి సింగిల్ రాగా, మూడో బంతిని అగర్వాల్ బౌండరీకి పంపాడు. దీంతో విజయానికి ఒక్క పరుగు అవసరం కాగా, నాలుగో బంతిని అగర్వాల్ బౌండరీకి తరలించడంతో మ్యాచ్ పంజాబ్ వశమైంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు