సైమండ్స్ అర్థసెంచరీ: పంజాబ్ లక్ష్యం 169

దక్షిణాఫ్రికాలో జరుగుతోన్న ఐపీఎల్ రెండో సీజన్లో భాగంగా, శనివారం పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌-హైదరాబాద్ డెక్కన్ ఛార్జర్స్ జట్ల మధ్య సమరం ప్రారంభమైంది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన డెక్కన్ ఛార్జర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 168 పరుగులు సాధించింది.

ఓపెనర్లుగా బరిలోకి దిగిన గిల్‌క్రిస్ట్ (20) శ్రీశాంత్ బౌలింగ్‌లో వెనుదిరగగా, గిబ్స్ (13) చావ్లా బౌలింగ్‌లో జయవర్ధనేకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. డెక్కన్ ఛార్జర్స్ జట్టులోకి వచ్చిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్ (36 బంతుల్లో ఒక్క ఫోర్, 2 సిక్స్‌లతో 60 పరుగులు) అర్థ సెంచరీ సాధించి, నాటౌట్‌గా నిలిచాడు.

ఇకపోతే.. సైమండ్స్ భాగస్వామ్యంతో ఆడిన వేణుగోపాలరావు (25 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 32 పరుగులు) చేశాడు. మిగిలిన బ్యాట్స్‌మన్లలో సుమన్ (27), శర్మ (9) పరుగులు మాత్రమే చేశారు. దీంతో డెక్కన్ ఛార్జర్స్, పంజాబ్ కింగ్స్‌కు 169 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

కింగ్స్ ఎలెవన్ బౌలర్లలో బ్రెట్‌లీ, శ్రీశాంత్, చావ్లా, మోతాలు ఒక్కొక్క వికెట్ చొప్పున నాలుగు వికెట్లు సాధించారు.

వెబ్దునియా పై చదవండి