మ్యాచ్‌లు గెలపించడంలో మహేంద్రసింగ్ ధోనీ ఎంత గొప్ప ఫినిషరో అందరికీ తెలుసు. చివరి 3 ఓవర్లలో 45 పరుగులు బాది ప్రత్యర్థికి చుక్కలు చూపించిన ధోనీ ఐపీఎల్ 10 సీజన్‌లో మరుపురాని ఇన్నింగ్స్ ఆడి జట్టును ఒంటిచేత్తో గెలిపించిన తీరు యావత్ క్రికెట్ ప్రేక్షకులను నివ్వెరపర్చింది. పుణె జట్టు యాజమాన్యం అయితే ఇలాంటి ఆడగాడిని అవమానించింది అంటూ విచారం వ్యక్తం చేసింది. అడవిలో సింహం ఎవరో తెలిసింది అంటూ పుణే జ్టటు కెప్టెన్ స్మిత్‌కు ధోనీకి మధ్య పోటీ పెట్టి ఈసడించిన జట్టు యజమాని తమ్ముడికి నోటి మాటపడిపోయింది.
అలాంటి ధోనీని చాన్నాళ్లుగా వ్యతిరేకిస్తున్న కొల్‌కతా జట్టు కెప్టెన్ గౌతమ్ గంభీర్ పరోక్షంగా ధోనీ ప్రతిభా పాటవాల గురించి వ్యాఖ్యానించాడు. ‘నా దృష్టిలో ఫినిషర్ అని స్టార్టర్ అని ఎవరూ ఉండరు. ఆఖరి పరుగు తీసినవాడే ఫినిషర్. అతను ఓపెనర్ కావచ్చు లేదా 11వ నంబర్ ఆటగాడు కావచ్చు. ఆటగాడు ఎలా ఆడాడన్నదే ముఖ్యం. తన జట్టు కోసం మ్యాచ్‌లు గెలిపించివాడే ఫినిషర్’ అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. అదే టోన్‌తో గంభీర్ తక్కువ పరుగులు చేసి డీలాపడిన తన జట్టును బుజ్జగించడం కాకుండా రెండో ఇన్నింగ్స్‌లో ఏమాత్రం ఉదాసీనత కనబర్చినా ఇదే మీ చివరి మ్యాచ్ అని హెచ్చరించడం ద్వారా గంభీర్ బెంగళూరు జట్టును చిత్తుగా ఓడించడానికి స్ఫూర్తిని కలిగించాడు.
తొలి ఇన్నింగ్స్‌లో మా బ్యాటింగ్‌ను చూశాక తీవ్ర నిరాశ కలిగింది. అనంతరం ప్రత్యర్థి బ్యాటింగ్ సమయంలో జట్టు సభ్యుల నుం చి నేను దూకుడు ఆశించాను. వారు గట్టిగా పోరాడాలని, గెలిపించాలని కోరుకున్నాను. ఎవరైనా కాస్త ఉదాసీనత కనబర్చినా కోల్‌కతా తరఫున వారికి ఇదే ఆఖరి మ్యాచ్ అని చెప్పాను. నేను కెప్టెన్‌గా ఉన్నంత వరకైతే వారు మళ్లీ ఆడలేరని హెచ్చరించాను’ అని గంభీర్ ఆదివారం మ్యాచ్‌ను గుర్తు చేసుకున్నాడు. గెలుపు అందుకునే ప్రయత్నంలో మైదానంలో ఆగ్రహావేశాలు ప్రదర్శించేందుకు తాను వెనుకాడనని... ఈ క్రమంలో ఫెయిర్‌ప్లే అవార్డు పాయింట్లు కోల్పోయినా తాను లెక్క చేయనని అతను వ్యాఖ్యానించాడు. తన జట్టు పాయింట్ల పట్టికలో ముందంజలో నిలవడమే తనకు ముఖ్యమని గంభీర్ తేల్చి చెప్పాడు.