సన్ రైజర్స్‌కి అచ్చిరాని వాంఖడే.. మొదట్లోనే తేలిపోయిన ఆట

గురువారం, 13 ఏప్రియల్ 2017 (02:55 IST)
బంతితో, బ్యాట్‌తో హర్బజన్ సాగించిన మెరుపులు, బుమ్రా పొదుపు బౌలింగ్‌తో సాగించిన విధ్వంసం కలిసి ముంబై ఇండియన్స్ చేతుల్లో సన్ రైజర్స్ పరాజయం పాలై ఉండవచ్చు కానీ గుణపాఠమై నిలిచిన ఈ పరాజయం వెనుక రెండు కారణాలు బలీయంగా పనిచేశాయి. ఒకటి టాస్ ఓడిపోయిన సన్ రైజర్స్ చివరి ఇన్నింగ్స్‌లో మంచుతో కలిగే అననుకూలతను తన పరం చేసుకుంది. ఇది సగం ఒటమికి కారణం. గత రెండు మ్యాచ్‌లలో సాగించిన బ్యాటింగ్ ఈ మూడో మ్యాచ్‌లో ప్రభావం చూపకపోవడం, కేవలం 158 పరుగులకే ఆలౌట్ అయి, ప్రత్యర్థికి ముందే ఆధిక్యతను ఇచ్చేయడం. వీటికి అదనంగా జత అయిన మరో కారణం ఏమిటంటే వాంఖడే స్టేడియం సన్ రైజర్స్‌కి అచ్చిరాకపోవడం. వాంఖడేలో ఆడిన మూడు సార్లూ సన్ రైజర్స్‌కి పరాజయమే ఎదురైంది.
 
హర్బజన్ మొదట బంతితో, తర్వాత బ్యాట్‌తో చేసిన విజృభణ, బుమ్రా, మలింగా అద్బుత స్పెల్‌తో సన్ రైజర్స్‌ని కట్టడి చేయడం మ్యాచ్‌నే మలుపుతిప్పింది. అన్ని రంగాల్లో ప్రతిభ చూపిన ముంబై ఇండియన్స్ విజయాన్ని సులువుగా ఎగురవేసుకు పోయింది. ముంబై  బౌలర్ త్రయం సక్సెస్ అయిన చోట నెహ్రా, ముర్తజా పెయిల్ అయారు. 
 
ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్ చేసే జట్టుకు అడ్డుకట్టలేసే మంచు ప్రభావం సన్ రైజర్స్‌ని దెబ్బకొట్టింది. సాధారణంగా పొదుపైన బౌలింగ్‌కు మారు పేరైన సన్ రైజర్స్ ఈరోజు తేలిపోయింది. ఇక ముంబై ఓపెనర్లు పార్ధివ్ పటేల్, నితీష్ రాణా విలువైన భాగస్వామ్యాలు రచించారు. నితిష్ రాణా తన నిలకడైన బ్యాటింగుతో టీమ్ ఇండియాలో తన చేరికకు మార్గం సుగమం చేసుకున్నాడు.
 
మరో 20, 30 పరుగులు అదనంగా చేసి ఉంటే గేమ్ తమ చేతుల్లోనే ఉండేదని సన్ రైజర్స్ కెప్టెన్ వార్నర్ చెప్పింది నిజమే. భువి, రషీద్ వంటి బౌలర్లు చాలా చక్కగా బౌలింగ్ చేసినప్పటీకీ విజయానికి అవసరమైన పరుగులు చేయలేకపోవడం అంతిమంగా పరాజయానికి బాట వేసింది అని వార్నర్ చెప్పాడు.
 

వెబ్దునియా పై చదవండి