రంజాన్ మాసం ప్రారంభం.. ఉపవాస దీక్షల విశిష్టత ఏంటి?

శుక్రవారం, 19 జూన్ 2015 (16:48 IST)
రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు విడదీయలేనివి. ఇస్లాం ధర్మం నుంచి కూడా ఉపవాస దీక్షను విడదీయలేం. మనిషికి ప్రత్యేకమైన శిక్షణ అవసరమని రంజాన్ మాసం ఉద్భోధిస్తుంది. అరబిక్‌ కేలండర్‌లో తొమ్మిదో మాసం రంజాన్‌. షాబాన్‌ మాసాంతంలో నెల పొడుపు కనిపించడంతోనే రంజాన్‌ మాసం ప్రారంభమవుతుంది. మరుసటి దినం తెల్లవారు ఝామునుంచే ఉపవాస దీక్షకు అంకురార్పణ జరుగుతుంది. 
 
ఉపవాసం అంటే కేవలం పస్తు ఉండటం మాత్రమే కాదు. మనిషికి తన సకలేంద్రియాలనూ నియంత్రించుకోవాలి. సమస్త వాంఛలను దూరంగా ఉంచాలి. కళ్లు, చెవులు, నాలుక, చేతులు, కాళ్లు మొత్తంగా మనిషి అస్తిత్వం సమస్తం ఉపవాస దీక్షలో మమేకం కావాలి. అబద్ధం చెప్పడం, చెడు చేయడం, తప్పుడు ఆరోపణలు చేయడం, అబద్ధపు వాగ్దానం చేయడం, వాంఛాలోలత్వం ఉపవాస దీక్షను భంగం చేసే అంశాలుగా అంతిమ దైవప్రవక్త (స) భావించారు.
 
ఇద్దరు శత్రువుల మధ్య సయోధ్యను కుదర్చడం రంజాన్‌ మాసంలో మనం నెరవేర్చగల అత్యున్నతమైన ఆచరణమని దైవ ప్రవక్త సెలవిచ్చారు. రంజాన్ మాసంలో రోజా లేదా ఉపవాసం పాటించడం వల్ల ముందుగా మనిషికి ఆకలి బాధేంటో తెలియవస్తుంది. ఈ మాసంలో నిజానికి ఆహారం మాత్రమే కాదు, ఆకలిని కూడా దైవప్రసాదంగానే ముస్లింలు భావిస్తారు. 
 
ఉపవాసాలను అనివార్యం చేయడం వెనకున్న ప్రధాన ఉద్దేశం ఏమిటంటే.. దైవపరాయణత అనే ప్రవృత్తిని నెలకొల్పడం. దైవపరాయణతనే ధార్మిక పరిభాషలో తఖ్వా అంటున్నారు. ప్రతి రోజూ వెలుగు రేకలు ప్రసరించడానికి ముందు కొంత ఆహారాన్ని స్వీకరించాలి. దీనిని సహరీ అంటారు. ప్రతి రోజూ సూర్యోదయం నుంచి సూర్యాస్తమం వరకూ అన్నపానీయాలకు దూరంగా ఉండాలి. సమస్త ఇంద్రియ వాంఛలనూ పూర్తిగా అదుపులో ఉంచుకోవాలి.
 
నిర్ణీత సమయాలలో నమాజ్‌ను ఆచరించటంతో పాటుగా తన రోజు వారీ సాధారణ దినచర్యలను పాటించాలి. సామాజిక, కుటుంబ బాధ్యతలను విస్మరించి దైవధ్యానంలో పాల్గొనమని ఇస్లాం సుతరామూ ప్రబోధించదు. అంతే కాదు. మనిషి తన విద్యుక్త ధర్మాలను పాటించడం కూడా దైవోపాసనలో అవుతుందని ఇస్లాం బోధిస్తుంది. 
 
సూర్యాస్తమయం అనంతరం నిర్ణీత సమయంలో ఉపవాస విరమణ చేయాలి. దీనినే ఇఫ్తార్‌ అంటారు. సహరీ (ఉపవాసదీక్ష) నిర్ణీత సమయం అంతిమ ఘడియల్లో చేయాలి. రంజాన్‌ మానవ సమాజాన్ని అనుశాసనం అనే ఒక అద్భుతమైన సుగుణంతో సుసంపన్నం చేస్తుంది. మనుషులను మానవులుగా, మంచి నాగరికులుగా తీర్చిదిద్దుతుంది. మనుషుల మధ్య సామూహిక స్పృహను పెంచుతుంది.

వెబ్దునియా పై చదవండి