ఇటీవలి కాలంలో సైబర్ నేరగాళ్లు (హ్యాకర్లు) రెచ్చిపోతున్నారు. అందుబాటులోకి వస్తున్న సరికొత్త టెక్నాలజీని తమకు అనువుగా మార్చుకుంటున్నారు. తాజాగా గూగుల్ డాక్ ఫైళ్ళతో జీమెయిల్ ఖాతాలపై దాడి చేస్తున్నారు. ముఖ్యమైన ఫైళ్లు పంపినట్లుగా జీమెయిల్ ఖాతాదారులను నమ్మిస్తూ వారి ఖాతాలను హ్యాకర్లు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారని ఐటీ నిపుణులు గుర్తించారు.
'ఫలానా వ్యక్తి ఈ ఫైల్‌ను షేర్ చేశాడు. ఆ ఫైల్‌ను గూగుల్ డాక్స్‌లో ఓపెన్ చేయండి' అంటూ హ్యాకర్లు కొన్ని లింకులు మన జీమెయిల్‌కు పంపుతారు. ఆ లింకును క్లిక్ చేసినట్టయితే 'అనుమతించు' అనే బటన్ వస్తుంది. ఆ బటన్‌ను నొక్కితే చాలు.. మన గూగుల్ ఖాతాను పూర్తిగా హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతుంది. ఆ తర్వాత కాంటాక్ట్ లిస్టులో ఉన్నవారందరికీ మన పేరుతోనే ఆ ప్రమాదకర ఈమెయిల్ వెళ్తుందట. దాంతో ఇతరులు కూడా హ్యాకర్ల దాడికి గురయ్యే ప్రమాదం ఉంటుంది.
పొరపాటు ఎవరైనా అలాంటి లింకులను క్లిక్ చేసివున్నట్టయితే, గూగుల్ ఖాతా సెట్టింగ్స్‌లోకి వెళ్లి తమ ఖాతాకు ఏఏ యాప్‌లు అనుసంధానమై ఉన్నాయో చూసుకోవాలి. అందుకోసం గూగుల్ ఖాతాలోకి లాగిన్ అయ్యి.. ‘సెక్యూరిటీ అండ్ కనెక్టెడ్ యాప్స్’ అనే ట్యాబ్ క్లిక్ చేయాలి. అందులో ‘గూగుల్ డాక్స్’ కనిపిస్తే తొలగించాలని నిపుణులు సూచిస్తున్నారు.