దేశంలో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీగా ఉన్న ఇన్ఫోసిస్ షాక్‌కు గురైంది. తన పనితీరుతో విమర్శలు ఎదుర్కొంటున్న విశాల్ సిక్కా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఎండీ, సీఈవో పదవులకు హఠాత్తుగా రాజీనామా చేశారు. ఆయన స్థానంలో తాత్కాలిక ఎండీ, సీఈవోగా యూబీ ప్రవీణ్ రావుకు బాధ్యతలు అప్పగించారు.
కాగా, శనివారం బోర్డు సమావేశం జరగడానికి ముందే సిక్కా రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. వాటాదారుల నుంచి షేర్లను తిరిగి కొనుగోలు చేసే(బైబ్యాక్) ప్రతిపాదనపై బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో ఆయన వైదొలగడం గమనార్హం. విశాల్ సిక్కా రాజీనామాను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఆమోదించారని అన్ని స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఇన్ఫోసిస్ సమాచారం అదించింది.