షాకింగ్ న్యూస్.. నో వాట్సాప్ యాప్‌... దానిస్థానంలో జియో చాట్...

మంగళవారం, 25 జులై 2017 (05:56 IST)
వచ్చేనెల 24వ తేదీ నుంచి జియో 4జి ఫీచర్ ఫోన్ ప్రీబుకింగ్స్ ప్రారంభంకానున్నాయి. దేశవ్యాప్తంగా 78 కోట్ల మంది ఫోన్ వినియోగదారులు ఉంటే.. వారిలో 50 కోట్ల మందికి ఫీచర్ ఫోన్ సౌకర్యం లేదు. వీరందరినీ తమవైపునకు తిప్పుకునేందుకు రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ జియో 4జి ఫీచర్ ఫోన్‌ను ఉచితంగా ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అయితే, ఈ పోన్ చూసేందుకు బాగానే ఉన్నప్పటికీ.. కొన్ని ఫీచర్లు ఇందులో లేకపోవడంతో వినియోగదారులు పెదవి విరుస్తున్నారు. 
 
ముఖ్యంగా సోషల్ మీడియాను శాసిస్తున్న ఫేస్‌బుక్, వాట్సాప్‌ యాప్‌లకు ఈ ఫోన్ సపోర్టు చేయదని గాడ్జెట్స్ 360 అనే వెబ్‍సైట్ షాకింగ్ న్యూస్‌ను వెల్లడించింది. కానీ, ఈ ఫోన్‌లో జియో యాప్స్ ప్రీలోడెడ్‌గా వస్తాయని, వీడియో కాలింగ్ చేసుకోవచ్చని, సినిమాలు చూసుకోవచ్చని, ఫేస్‌బుక్, యూట్యూబ్ తదితర సోషల్ మీడియాను ఉపయోగించుకోవచ్చని సంస్థ పేర్కొంది.
 
అయితే ఈ ఫోన్ పాపులర్ యాప్ ‘వాట్సాప్’కు సపోర్ట్ చేయదు. దేశంలో 20 కోట్ల మంది వాట్సాప్ యూజర్లు ఉండగా ఈ ఫోన్ తీసుకోవాలనుకునే వారికి ఇది చేదు వార్తే. అయితే ఆ తర్వాత వాట్సాప్‌ను జియో అప్‌డేట్ చేసే అవకాశం ఉందని పేర్కొంది. కాగా, కొత్త డివైజ్‌లలో వాట్సాప్‌కు పోటీగా జియో చాట్‌ను తెచ్చే అవకాశం లేకపోలేదని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి