జేబులో పేలిన ఒప్పో స్మార్ట్ ఫోన్... కేసు నమోదు!

బుధవారం, 27 మార్చి 2019 (12:03 IST)
స్మార్ట్ ఫోన్... చూడడానికి ఎంత స్మార్ట్‌గా ఉంటున్నాయో... కాస్త తేడా వస్తే అంతే స్మార్ట్‌గా ముంచేస్తున్నాయనేది కూడా నిజమేనంటున్నారు వినియోగదారులు. మొబైల్ రేడియేషన్‌లు, వాటి ప్రభావాలు ఒక ఎత్తయితే... మనం జేబులో పెట్టుకున్న ఫోన్ ఎప్పుడు కొంప ముంచుతుందోనని సగటు వినియోగదారుడు భయపడుతున్నాడు. తాజాగా అలాంటి సంఘటనే హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.
 
వివరాలలోకి వెళ్తే... అల్వాల్ ప్రాంతానికి చెందిన ఇమ్రాన్ అరటి పళ్ల వ్యాపారం చేసుకుంటూ... ఎంతో ముచ్చటపడి రెండు రోజుల క్రితం ఒప్పో కంపెనీకి చెందిన స్మార్ట్ ఫోన్‌ని కొనుగోలు చేసాడు. ఈ నేపథ్యంలో పదవ తరగతి పరీక్షలు రాసి వస్తున్న తన బంధువుల అమ్మాయిని తిరిగి తీసుకువస్తున్న సమయంలో ఫ్యాంట్ జేబులో పెట్టుకున్న ఫోన్ ఒక్కసారిగా పేలడం జరిగింది. 
 
దీంతో అతను బైక్ పైనుంచి పడిపోగా, తలకు కూడా గాయమైంది. ఇది గమనించిన స్థానికులు బాధితుడిని కంటోన్మెంట్ ఆసుపత్రికి తరలించారు. స్మార్ట్ ఫోన్ ప్యాంట్ జేబులో ఉండబట్టి, తొడకు తీవ్రగాయాలతో ప్రాణాలు దక్కించుకున్నాడు గానీ, అదే షర్ట్ జేబులో ఉండుంటే ప్రాణాలే పోయేవి. కాగా... బాధితుడు ఇమ్రాన్ ఒప్పో కంపెనీపై బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇక్కడ గమనార్హం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు