చేతులు కలిపిన టిమ్ - జుకెర్‌బర్గ్ - సుందర్ పిచాయ్, ట్రంప్‌కు మడతడిపోద్దా...?
గురువారం, 2 ఫిబ్రవరి 2017 (17:47 IST)
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా టెక్ దిగ్గజ కంపెనీలన్నీ ఏకమయ్యాయి. ట్రంప్ అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రకటించిన ఏడు ముస్లిం మెజారిటీ దేశాలపై వీసా నిషేధాన్ని ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ విషయంలో ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆపిల్, గూగుల్, ఫేస్‌బుక్ సహా కార్పొరేట్ కంపెనీలన్నీ ఏకమయ్యాయి. ఈ కార్పొరేట్ దిగ్గజాలన్నీ కలిసి ట్రంప్‌కు లేఖ రాయనున్నాయి.
ఓ వివాదాస్పద నిర్ణయంపై ఇలా పెద్ద కంపెనీలన్నీ కలిసికట్టుగా ముందుకు రావడం ప్రపంచంలో ఇదే తొలిసారి కావడం విశేషం. వీసా నిషేధంపై గత వారం రోజులుగా అమెరికన్ల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్న విషయం తెల్సిందే. వలస కుటుంబాలు నెలకొల్పిన కంపెనీలతో నిండిపోయిన సిలికాన్ వ్యాలీలో నిరసనల తీవ్రత మరింత ఎక్కువగా కనిపిస్తోంది.
సర్జీ బ్రిన్, టిమ్ కుక్, మార్క్ జుకెర్‌బర్గ్ సహా పలు కార్పొరేట్ అధినేతలు ట్రంప్ నిర్ణయాన్ని బహిరంగంగానే తూర్పారబడుతున్నారు. దాదాపు అన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీలూ అధ్యక్షుడి నిర్ణయంపై మండిపడ్డాయి. ఇప్పటికే ట్విట్టర్, ఎయిర్ బీఎన్‌బీ వంటి కంపెనీలు శరణార్థులకు అండగా ఉంటామని ప్రకటించాయి.
ఈ పరిస్థితుల్లో టిమ్ కుక్, మార్క్ జుకెర్‌బర్గ్, సుందర్ పిచాయ్‌లు ఏకం కావడం గమనార్హం. ‘‘వలసలు లేకుండా ఆపిల్ కంపెనీనే లేదు. ట్రంప్ వలస విధానం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. దీనిపై కలిసికట్టుగా గొంతు వినిపించాలి. సరికొత్త పంథాతో ముందుకెళ్లాలి’’ అంటూ ఆపిల్ సీఈవో టిమ్ కుక్ వ్యాఖ్యానించారు.
అలాగే, ఫేస్‌బుక్ సీఈవో జుకెర్‌బర్గ్ స్పందిస్తూ.. ‘‘ట్రంప్ నిర్ణయం మీలో చాలామందిలాగే నేనూ ఆందోళన చెందుతున్నాను. శరణార్థుల కోసం ఎవరు ఎలాంటి సహాయం కోరినా చేసేందుకు మా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి’’ అని బాహాటంగా ప్రకటించారు.
ఇక టెక్ సెర్చ్ ఇంజన్ గూగుల్ సీఈవో సుందర్ పీచాయ్ మాట్లాడుతూ... ‘‘ఈ ఆదేశాల వల్ల కలిగే ప్రభావంతో పాటు గూగుల్ అభిమానులు, వారి కుటుంబాలపై ఆంక్షలు విధించే ప్రతిపాదనలు చాలా ఆందోళనకు గురిచేస్తున్నాయి. అమెరికాకు గొప్ప నైపుణ్యాన్ని తీసుకువచ్చేందుకు ఇలాంటి నిర్ణయాలు అడ్డంకులు సృష్టిస్తాయి’’ అని వ్యాఖ్యానించారు.